raghurama krishnam raju yv subbareddy ysrcp andhra pradesh narsapuram ys jagan వైవీ సుబ్బారెడ్డి వైసీపీ ఆంధ్రప్రదేశ్ నర్సాపురం వైఎస్ జగన్ politics
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు నర్సాపురంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు... ఆపై 24 గంటల్లోపే పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,మంత్రి శ్రీరంగనాథ రాజు కలిసి 2వేల మందితో తనపై దాడికి కుట్ర పన్నారని... అందుకే పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ కుట్ర వెనుక కారణాలేంటో చెప్తూ తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలపై మంత్రి శ్రీరంగనాథరాజుపై,రాజమండ్రిలో ఆవ భూముల కుంభకోణంపై వైవీ సుబ్బారెడ్డిపై ఫిర్యాదులు చేసినందుకే తనపై కుట్ర పన్నారని ఆరోపించారు.

500 కార్లతో అభిమానులు వస్తున్నారని తెలిసి...
తనపై దాడి చేయాలనే కుట్ర వెనుక సీఎం జగన్ హస్తం ఉందో లేదో తెలుసుకునేందుకు శుక్రవారం(ఫిబ్రవరి 26) కూడా సీఎంవో కార్యాలయాన్ని సంప్రదించే ప్రయత్నం చేసినట్లు రఘురామ వెల్లడించారు. అయితే అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. ఇంటలిజెన్స్ అధికారుల నుంచి తనకు అందిన సమాచారం మేరకు... రాజమండ్రి విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు అభిమానులు 500 కార్లతో అక్కడికి వస్తున్నట్లు పోలీసులకు తెలిసిందన్నారు. ఆ రిపోర్టును ఇంటలిజెన్స్ శాఖలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక డీఎస్పీ స్థాయి అధికారి చేరవేయాల్సిన వారికి చేరవేశాడని చెప్పారు.

అందుకే కుట్ర చేశారు : రఘురామ
'గతంలో ఇళ్ల స్థలాల కేటాయింపులలో అవకతవకలు జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్లడం, దానిపై కలెక్టర్ గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం, చాలామంది ఫోన్ చేసి ఫిర్యాదులు ఇవ్వడం,వారిపై గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు తన అనుచరులతో దాడి చేయించడం జరిగింది. పోలీసుల సహకారంతో కంప్లయింట్లు ఇచ్చినవారిపైనే తిరిగి కంప్లయింట్లు పెట్టేలా చేయడం అందరికీ తెలిసిందే. మంత్రి గారి సొంత నియోజకవర్గమైన ఆచంట నియోజకవర్గంలో ఆయన బంధు మిత్రులు ఆడిందే ఆటగా ఒక ఆటవిక రాజ్యం నడుస్తోంది. అలాగే గతంలో రాజమండ్రి ఆవ భూముల కుంభకోణం విషయంలో టీటీడీ ఛైర్మన్,ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డిపై ప్రధానమంత్రి నేను ఫిర్యాదు చేయడం జరిగింది.' అని ఈ సందర్భంగా రఘురామ గుర్తుచేశారు.

జేసీని టార్గెట్ చేసిన తరహాలో...
తాను నర్సాపురం పర్యటన ఖరారు చేయడంతో... మంత్రి శ్రీరంగనాథ రాజు వైవీ సుబ్బారెడ్డిని కలిసిశారని... ఆ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని రఘురామ ఆరోపించారు. 'గతంలో జరిగిన పలు విషయాలను దృష్టిలో పెట్టుకుని డీఐజీకి ఫోన్ చేసి... నాపై ఎస్సీ,ఎస్టీ అట్ట్రాసిటీ కేసు బనాయించి ఎలాగైనా అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది.' అని ఆరోపించారు.మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన తరహాలోనే తననూ టార్గెట్ చేయాలని చూశారన్నారు. ఆ ప్రాంతంతో సంబంధం లేని సర్కిల్ ఇన్స్పెక్టర్ను ముందుపెట్టి... ప్రభాకర్ రెడ్డి అనని మాటలు అన్నారని ఆయన్ను జైల్లో పెట్టడం... ఆ తర్వాత ఆయనకు కరోనా సోకడం జరిగిందని గుర్తుచేశారు.

జగన్‌కూ రఘురామ హెచ్చరిక...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి... సొంత పార్టీ ఎంపీని నియోజకవర్గంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటుంటే సీఎం ప్రశ్నించకపోవడం బాధాకరమని రఘురామ అన్నారు. నిన్నటి నుంచి సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత మొత్తుకున్నా అరణ్య రోదన లానే ఉందన్నారు. ఒకవేళ ఈ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లినట్లయితే తక్షణం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి,మంత్రి రంగనాథ రాజులపై చర్యలు తీసుకుని తాను నా నియోజకవర్గ పర్యటనకు వెళ్లేందుకు సహకరించాలని ఆయన్ను కోరుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా వాళ్లపై చర్యలు తీసుకోకపోతే దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు.తదుపరి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిది కాదన్నారు.

మనోభావాలు దెబ్బతిన్నందుకే కేసులు : మంత్రి శ్రీరంగనాథ
మరోవైపు మంత్రి శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ... కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా రఘురామ చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే ఆయనపై పలువురు కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి కులాలు, మతాలు, పార్టీలు, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. సీఎంవో కార్యాలయంపై విమర్శలు తగవని హితవు పలికారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, మంత్రిగా ఉన్న తనను హేళన చేసేలా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు.పార్టీలో కొనసాగుతూ పార్టీ గురించి దుష్ప్రచారం చేసే వ్యక్తిగా రఘురామకృష్ణంరాజు చరిత్రలో మిగిలిపోతారని అన్నారు.