112 పేజీల శుభలేఖ ... కుమార్తె పెళ్లికి వివాహ ప్రత్యేకత తెలిపేలా వెడ్డింగ్ ఇన్విటేషన్
పెళ్లికి ఆహ్వానాన్ని పలికేది శుభలేఖ. ఈ శుభలేఖ ద్వారా ఎవరికి వారు తమ ఆహ్వానాన్ని ప్రత్యేకంగా అతిథులకు తెలియజేస్తారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు శుభలేఖ డిజైన్లను నిర్ణయిస్తారు. కొందరు సాధారణమైన కార్డులు ప్రింట్ చేస్తే, కొందరు అత్యంత ఖరీదైన శుభలేఖలను ప్రింట్ చేయిస్తారు. అయితే సాధారణంగా శుభలేఖ రెండు నుండి నాలుగు పేజీలు ఉంటుంది. కానీ 112 పేజీలతో భారీ శుభలేఖను తయారు చేయించారు కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి.
రైతు మ్యారేజ్ బ్యూరో ... అక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే.. ఎందుకంటే..

112 పేజీలతో వెడ్డింగ్ కార్డు వేయించిన కర్ణాటక రచయిత
కర్ణాటకకు చెందిన రచయిత పంచాక్షరప్ప తన కుమార్తె వివాహం కోసం ఏకంగా 112 పేజీలతో వెడ్డింగ్ కార్డును తయారు చేయించారు. ఈ వెడ్డింగ్ కార్డ్ ను ప్రత్యేక రంగులతో కూడిన ఆర్ట్ పేపర్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక 112 పేజీలలో వివాహ ఆహ్వానం ఏమి రాశారు అన్న సందేహం కలగొచ్చు . అంత మ్యాటర్ అందులో ఏముంది అని అనుకునే వారికి అందులో చాలానే మ్యాటర్ ఉందని ఆ కార్డు చూస్తే అర్ధం అవుతుంది .

పంచరంగి పేరుతో పెళ్లి గొప్పతనం తెలిసేలా ముద్రణ
పంచరంగి పేరుతో ముద్రించిన ఈ పెళ్లి పత్రికలో ఆయన తన పద్యాలు, కవితలతో పాటుగా , వివాహ బంధాన్ని తెలిపే ఎన్నో ప్రత్యేకతలను ఈ వెడ్డింగ్ కార్డ్ ద్వారా వివరించారు. అసలు వివాహం ఎందుకు చేసుకుంటారు. వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటి? తదితర వివరాలు అందరికీ తెలిసేలా ఈ వెడ్డింగ్ కార్డులో వివరించారు. వివాహాలపై ప్రతి ఒక్కరికీ సదభిప్రాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ వెడ్డింగ్ కార్డులు రూపొందించామని, ఖర్చుతో కూడుకున్నప్పటికి అందరికీ వివాహం యొక్క గొప్పతనం చెప్పటం తన ధర్మంగా భావించానని రచయిత పంచాక్షరప్ప పేర్కొన్నారు.

వెడ్డింగ్ కార్డుపై భిన్నాభిప్రాయాలు
ఇక ప్రస్తుతం 112 పేజీల ఈ వెడ్డింగ్ కార్డ్ అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే కొందరు 112 పేజీల ఈ వెడ్డింగ్ కార్డు చదవాలా అని దీర్ఘ నిట్టూర్పు విడుస్తూ ఉంటే , మరికొందరు 112 పేజీలు వెడ్డింగ్ కార్డ్ వేయించిన పంచాక్షరప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ఖర్చును లెక్కచేయకుండా 112 పేజీల వెడ్డింగ్ కార్డును వేయించడం గొప్ప విషయం అంటున్నారు.