Illegal mining: గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళితే ఏమైనా జరగొచ్చు, సుప్రీం కోర్టులో సీబీఐ కౌంటర్
బెంగళూరు/ బళ్లారి/ న్యూఢిల్లీ: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెడితే ఏమైనా జరగొచ్చు ?, ఇప్పటికే కేసులు విచారణలోనే ఉన్నాయి. అక్కడ చాలా మంది సాక్షులు ఉన్నారు, తరువాత జరగరానిది ఏదైనా జరిగితే ఎలా అంటూ సీబీఐ అధికారులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాగైనా బళ్లారికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ అధికారులు తాత్కాలికంగా చెక్ పెట్టడంతో బళ్లారిలోని ఆయన వర్గీయులు అయోమయానికి గురైనారు.
Ex lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలో

అక్రమ మైనింగ్ కేసులు
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. అక్రమ గనుల కేసులకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు షరతులతో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సిటీతో పాటు ఆ జిల్లాలో అడుగు పెట్టకూడదని గతంలో సుప్రీం కోర్టు షరుతులు విధించి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయ్యా....బళ్లారికి వెళ్లాలి.....అనుమతి ఇవ్వండి
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళ్లకుండా బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టు అనుమతి తీసుకుని నాలుగు రోజులు బళ్లారి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో ఆయన కుమార్తె వివాహ ఏర్పాటు చూసుకుని తరువాత బెంగళూరులో పెళ్లి జరిపించారు. బళ్లారికి ఎప్పుడు వెళ్లాలన్నా గాలి జనార్దన్ రెడ్డి కచ్చితంగా సుప్రీం కోర్టు అనుమతి తీసుకుంటున్నారు. ఇప్పుడు తాను బళ్లారి వెళ్లి అక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సీబీఐ అభ్యంతరం
గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళ్లి అక్కడ ఉండటానికి సీబీఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి నిందితుడని, ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారని, ఆయన బళ్లారి వెళితే దర్యాప్తుకు అంతరాయం కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

47 మంది సాక్షులు ఉన్నారు
అక్రమ మైనింగ్ కేసులో 47 మంది సాక్షులు ప్రస్తుతం బళ్లారిలో ఉన్నారని, గాలి జనార్దన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళితే సాక్షులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఆ తరువాత కేసు విచారణ తప్పుదోవపట్టే అవకాశం ఉందని సీబీఐ అధికారులు అంటున్నారు. అక్రమ మైనింగ్ కేసులో సాక్షులపై ప్రబావం పడకుండా ఉండాలంటే గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళ్లకుండా ఉండాలని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టులో మనవి చేశారు.

గాలి దెబ్బకు ఏమైనా జరగొచ్చు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి పలుకుబడి ఎక్కువగా ఉందని, ఆయన బళ్లారికి వెళితే ఏమైనా జరగొచ్చు అంటూ సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చెయ్యాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ విచారణ డిసెంబర్ నెలకు వాయిదా పడింది.