లేడీస్ క్లబ్ సభ్యుల గోవా ట్రిప్ విషాదంతం: టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి మినీ బస్ నుజ్జునుజ్జు
బెంగళూరు: కనుమ నాడు జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ ఒకే లేడీస్ క్లబ్ సభ్యులుగా గుర్తించారు.

లేడీస్ క్లబ్.. గోవా ట్రిప్..
కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించింది. మృతులు దావణగెరె లేడీస్ క్లబ్‌కు చెందిన సభ్యులుగా గుర్తించారు. మృతుల్లో మినీ బస్ డ్రైవర్ ప్రవీణ్, క్లబ్ సభ్యులు ఆశా, మీరాబాయి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేదా, వీణా, మంజుల, నిర్మల, రజినీశ్రీ, ప్రియ ఉన్నారు. దావణగెరె రిథమ్ లేడీస్ క్లబ్‌కు చెందిన మహిళలు 17 మంది మినీబస్‌లో గోవాకు బయలుదేరి వెళ్లారు. ప్రతి సంవత్సరమూ సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత వారంతా గోవా లేదా ఏదైనా ఇతర పర్యాటక కేంద్రానికి వెళ్తుంటారు. ఈ సారి కూడా సంక్రాంతి పండుగ మరుసటి రోజే గోవాకు ట్రిప్ వేశారు. ఓ మినీబస్‌ను అద్దెకు తీసుకున్నారు.

ధార్వాడ వద్ద టిప్పర్ ఢీ కొట్టడంతో..
ఈ తెల్లవారు జామున వారు దావణగెరె నుంచి పనాజీకి బయలుదేరారు. వారి ప్రయాణం గమ్యానికి చేరలేదు. అర్ధాంతరంగా ముగిసింది. మార్గమధ్యలో ధార్వాడ సమీపంలోని ఇట్టిగట్టి గ్రామం వద్ద వారు ప్రయాణిస్తోన్న మినీబస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన టిప్పర్.. ఆ మినీ బస్సును అతి వేగంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. మినీ బస్సు నుజ్జునుజ్జయింది. ఫ్రంట్ సీట్లో కూర్చున్న మహిళలు సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. బస్సు బయలుదేరడానికి ముందు తీసుకున్న ఫొటో చివరిదైంది.

మృతుల్లో టిప్పర్ డ్రైవర్..
ఈ ఘటనలో మరోో అయిదుమంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. టిప్పర్ డ్రైవర్ కూడా మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే ధార్వాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గాయపడ్డ అయిదుమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ధార్వాడలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని హుబ్బళ్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో..
మృతులందరూ దావణగెరెకు చెందిన వారే. సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనే వారని స్థానికులు చెబుతున్నారు. రిథమ్ లేడీస్ క్లబ్ తరఫున వారంతా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించే వారని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లయన్స్ క్లబ్ ఇతర స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ తరచూ వైద్య పరీక్షలను నిర్వహించే వారని, కరోనాపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడానికి అనేక శిబిరాలను నిర్వహించారని, లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ప్రాంతానికి, ఒకే క్లబ్‌కు చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలముకున్నాయి.