Karnataka Band: బెంగళూరులో బంద్ కు నో చాన్స్, 15 వేల మంది పోలీసులు, తేడా వస్తే తోలు తీస్తాం, వార్నింగ్!
బెంగళూరు/ బళ్లారి/ బెళగావి: కర్ణాటక ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డిసెంబర్ 5వ తేదీ కర్ణాటక బంద్ కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 5వ తేదీ బంద్ కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కన్నడ సంఘాలు మనవి చేశాయి. కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. బెంగళూరులో మాత్రం బంద్ కు అనుమతి ఇవ్వడం లేదని, ఎవరైనా తిక్కచేష్టలు చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే రసం పిండేస్తామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు.

మరాఠీ అభివృద్ది మండలి
కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు ఏమిటి ?, ఇప్పటికే బెళగావి జిల్లా (కర్ణాటక) మొత్తం మరాఠీ మయం అయిపోయిందని, అక్కడి నాయకులు మరాఠీలే ఎక్కువ అయ్యారని కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రభుత్వం VS కన్నడ సంఘాలు
కర్ణాటకలో మరాఠీ అభివృద్ది మండలి ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కర్ణాటకలో మరాఠీ బాషను వీళ్లు పెంచిపోషించాలని అనుకుంటున్నారా ? అంటూ కన్నడ సంఘాలు నిలదీశాయి. అయితే కర్ణాటక ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉండటంతో వివాదం ముదిరిపోయింది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 5వ తేదీన కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.

బెంగళూరులో నో చాన్స్
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సిటీ బంద్ కు పలు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ కు బెంగళూరు ప్రజలు పూర్తిగా సహకరించాలని కన్నడ సంఘాలు మనవి చేశాయి. అయితే బెంగళూరులో బంద్ కు తాము ఇంత వరకు అనుమతి ఇవ్వలేదని, నగర ప్రజలు ఎప్పటిలాగే వారి పనులు వారు చేసుకోవాలని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ మనవి చేశారు.

15 వేల మంది పోలీసులు
కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చిన సందర్బంగా ఆ రాష్ట్రంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు సిటీలో బంద్ కు అనుమతి ఇవ్వకపోవడం, బంద్ చేస్తామని కన్నడ సంఘాలు పట్టుబట్టడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బెంగళూరు సిటీలో 15 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు.

డైలమాలో బెంగళూరు ప్రజలు
బెంగళూరు సిటీ బస్సులు (BMTC)తో పాటు కేఎస్ఆర్ టీసీ బస్సులు, అన్ని వాహనాలు సంచరిస్తాయని, ప్రజలు ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ అన్నారు. మొత్తం మీద శనివారం బెంగళూరులో బంద్ ఉండదని సిటీ పోలీసు బాస్ కమల్ పంత్ క్లారిటీ ఇచ్చినా ప్రజలు మాత్రం మా పనులు మేము చేసుకోవాలా ? వద్దా ? అంటూ డైలమాలో పడిపోయారు.