రాసలీలల యువతి అదృశ్యం..? ఆమె ఎక్కడ, తప్పించారా.. తప్పుకున్నారా..?
కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దెబ్బకు మంత్రి రమేశ్ జార్కిహోళి పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే అందులో ఉన్న యువతీ కనిపించడం లేదు. దీంతో రాసలీలల కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ యువతి ఎక్కడుంది..? ఎక్కడికైనా వెళ్లిందా..? లేదంటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి చెప్పే అంశాల ఆధారంగా కేసుకు బలం చేకూరనుంది. సరిగ్గా ఈ సమయంలో ఆమె కనిపించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

యువతి ఎక్కడ..?
యువతి ఎక్కడ ఉందనే అంశాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ నంబర్ కూడా లభ్యం కాలేదని పోలీసులు అంటున్నాయి. మంగళవారం రమేశ్, సదరు యువతి ఏకాంత వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై విమర్శలు వెల్లువెత్తగా, ఆయన తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఓ శాసన సభ్యుడి ప్రోద్బలంతోనే సదరు యువతి రమేశ్‌పై వలపు వల విసిరిందని మంత్రి అనుకూల వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

రాజకీయ కక్ష..
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని అంటున్నాయి. ఏడాది నుంచి రమేశ్, ఆ యువతి మధ్య వివాహేతర బంధం నడుస్తోందని పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఆచూకీ లభిస్తే, పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇదీ ప్రస్తుతానికి సస్పెన్స్ కాగా.. ఆమె ఆచూకీ తెలిస్తే నిజం నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.

ఉద్యోగం పేరుతో లోబర్చుకొని..
ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని లోబర్చుకున్నారని మోసం చేశారని ఆడియో, వీడియోను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌కు పౌరహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి అందజేశారు. బెంగళూరులోని ఆర్టీ నగరలో నివాసం ఉండే యువతి డ్యామ్‌లను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. అలా పరిచయమై శారీరక సంబంధం వరకూ వెళ్లిందనేది ఆమె ఆరోపిస్తున్నారు.

ప్రణాళిక ప్రకారమే జరిగిందా..?
రాసలీలల వీడియో పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో సంచలనం కలిగింది. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్టీ నగర్‌కు చెందిన యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని.. తర్వాత మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలే పక్కా ప్రణాళికతోనే వీడియో తీయించి ఉంటుందని భావిస్తున్నారు.

కీ రోల్
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో రమేశ్ జార్కిహొళి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ నేతలతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి పక్కాగా పావులు కదిపారు. అలాంటి నేత వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది.