కర్ణాటకలో నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్ కర్ఫ్యూ, ఆగస్టు 23 నుంచి వారికి తరగతులు: సీఎం బొమ్మై
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనవైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటోంది. కేరళ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం 5 గంటల వరకు విధించనున్నట్లు తెలిపింది. కేరళ, మహారాష్ట్రలకు సరిహద్దుగా ఉన్న ఎనిమిది సరిహద్దు జిల్లాలు బీదర్, కలబూర్గి, బెలగావి, విజయపుర, చమరాజనగర, మైసూరు, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో వీకెండ్ కర్ఫ్యూ విధించనున్నట్లు వెల్లడించింది.

కోవిడ్-19 అడ్వైజరీ కమిటీ, ఇతర సీనియర్ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఈ మేరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 23 నుంచి 9వ తరగతి నుంచి 12వ తగరతి వరకు క్లాసులను ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ తరగతులు ప్రత్యామ్నాయ రోజుల్లో ఉంటాయని తెలిపారు.
ఒకటి నుంచి 8వ తరగతి వరకు క్లాసులను ప్రారంభించే విషయంపై తర్వాత కరోనావైరస్ మహమ్మారి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని సీఎం బొమ్మై వెల్లడించారు. కాగా, కర్ణాటకలో గురువారం 1785 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 25 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మొత్తం కేసులు 29.13లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 36,705కు చేరింది.
మరోవైపు గత 24 గంటల్లో 1651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 28,52,368కి చేరింది. బెంగళూరులో గురువారం 414 మంది కరోనా బారినపడ్డారు. 554 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 24,414 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు, పాజిటివిటీ రేటు 1.10 శాతంగా ఉండగా, కేసు మరణాల రేటు(CFR) 1.40 శాతంగా ఉంది. గురువారం నమోదైన 25 మరణాలలో 5 బెంగుళూరు అర్బన్, బెళగావి, దక్షిణ కన్నడ, కోలార్ 3, మాండ్య, మైసూరు, ఉడిపి 2 నుంచి ఉన్నాయి.
కొత్త కేసులు నమోదైన జిల్లాల్లో, బెంగళూరు అర్బన్ 414, దక్షిణ కన్నడ 337, ఉడిపి 134, హసన్ 125, మైసూరు 105, కొడగు 100, ఇతర జిల్లాలు ఉన్నాయి. పాజిటివ్ కేసుల జాబితాలో బెంగళూరు అర్బన్ జిల్లా అగ్రస్థానంలో ఉంది, బెంగళూరులో మొత్తం 12,29,340, మైసూరు 1,73,599, తుమకూరు 1,18,136 పాజిటివ్ కేసులున్నాయి.
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మళ్లీ 40 వేలకు పైగా కేసులు నమోదవుతోంది. గత 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 464 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,26,754 కి చేరింది.
ఇదిలాఉంటే.. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కరోనా నుంచి 41,096 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,15,844 కి పెరిగింది. అయితే.. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం 4,14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా గురువారం నమోదైన కేసుల్లో.. అత్యధికంగా కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో 22 వేల కేసులు, మహారాష్ట్రలో 9వేల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ రేటు 1.30 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 49,53,27,595 కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే కేరళకు వైద్య బృందాన్ని పంపింది కేంద్రం. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో సగం కేసులు కేరళ రాష్ట్రం నుంచే ఉండటం ఆందోళనకరంగా మారింది. దాదాపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన క్రమంలో కేరళలో రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
దేశంలో ఇప్పటికే భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు. రాష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని కూడా గత కొంత కాలంగా పంపిణి చేస్తున్నారు. తాజాగా, జాన్సన్ అండ్ జాన్సన్ కూడా తన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలనంటూ మనదేశంలో దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి వస్తే మరో వ్యాక్సిన్ కూడా దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్క డోసు వ్యాక్సినే కావడం గమనార్హం. బయోలాజిక్ ఈ వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.