Ragini: సంక్రాంతి పండుగకు హీరోయిన్ కు చిప్పకూడే, మొన్న లగ్జరీ లైఫ్, ఆటోగ్రాఫ్ లు, నేడు జైల్లో రామభజన !
బెంగళూరు/ న్యూఢిల్లీ/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి అలియాస్ రాగిణి ద్వివేది సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆమెకు మాత్రం మరోసారి నిరాశ ఎదురైయ్యింది. సంక్రాంతి పండుగ ముందే జైలు నుంచి బయటకు రావాలని రాగిణి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టులో బెయిల్ మంజూరు కాకపోవడంతో ఎలాగైనా జైలు నుంచి బయటకు రావాలని రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో వాదనలు పూర్తి అయిన తరువాత రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందే ముద్దుగుమ్మ షాక్ కు గురైయ్యింది.

రాగిణికి సినిమా కష్టాలు
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీ బేబి రాగిణిని గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని యలహంకలోని రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాగిణి ద్వివేదిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేకసార్లు విచారణ చేశారు.

రాగిణికి పలుకుబడి ఎక్కువ
డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలు, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలి అంటూ రాగిణి ఆమె తరపు న్యాయవాదులతో బెంగళూరులోని ఎన్ డీపీఎస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నటి రాగిణికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఆమె డ్రగ్స్ సేవించినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు.

మేడమ్ చెప్పింది కొత్తకథ
తనకు ఏపాపం తెలీదని, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి డ్రగ్స్ కేసుతో పక్కా సంబంధం ఉందని, బెయిల్ ఇవ్వకూడదని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి రాగిణ ద్వివేది బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యింది.

సంజనా, డ్రగ్స్ కింగ్ పిన్ కు బెయిల్
బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ హీరోయిన్ రాగిణితో పాటు బహుబాష నటి సంజనా కూడా అరెస్టు అయ్యింది. నటి రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. రాగిణితో పాటు సంజనా, ఇదే కేసులో అరెస్టు అయిన కొందరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యం కారణంతో నటి సంజనా గల్రానీ బెయిల్ తీసుకుని ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చింది. ఇదే కేసులో డ్రగ్స్ కేసు కింగ్ పిన్ వీరన్ ఖన్నాకు బెయిల్ మంజూరు అయ్యింది. వేరే కేసులో బెయిల్ రాకపోవడంతో వీరేన్ ఖాన్నా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇదే డ్రగ్స్ కేసులో శివప్రకాష్ కూడా జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు.

సంక్రాంతికి కూడా చిక్కలేదు మోక్షం
మొన్న దీపావళి, నిన్న నూతన సంవత్సరం వేడుకలకు ముందే నటి రాగిణి జైలు నుంచి బయటకు రావాలని అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సుప్రీం కోర్టులో కూడా రాగిణికి బెయిల్ మంజూరు కాలేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగకు అయినా జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావాలని రాగిణి అనేక ప్రయత్నాలు చేసినా ఆమెకు ప్రస్తుతానికి మోక్షం కలగలేదు.

హైకోర్టు తీర్పు రద్దు చెయ్యండి
మంగళవారం సుప్రీం కోర్టులో రాగిణి బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణ పూర్తి అయ్యిందని, రాగిణి అనారోగ్యంతో బాధపడుతోందని, కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చెయ్యాలని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని, పోలీసుల విచారణకు రాగిణి పూర్తిగా సహకరిస్తుందని ఆమె న్యాయవాది సిద్దార్థ లూత్రా సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

జనవరి 19వ తేదీ
వాదనలు విన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి నారిమన్ రాగిణికి బెయిల్ ఇవ్వడానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ జనవరి 19వ తేదీకి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ రోజు కూడా జైల్లో గడపాల్సి రావడంతో నటి రాగిణి షాక్ కు గురైయ్యిందని ఆమె సన్నిహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.