వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంటలకు మద్దతు ధర అమలు ప్రాతిపదికేది?: మూడేళ్ల తర్వాత కళ్లు తెరిచిన మోదీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఒకటిన్నర రెట్లు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే సంవత్సర ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చారు. ఇక్కడ రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. అన్నదాత సాగు చేసిన పంటలకు కనీస మద్దతు ధర లభించాలంటే కేంద్రంతోపాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సారధ్యం వహిస్తున్న అధికార పార్టీల్లో చిత్తశుద్ధి కావాలి.
ఇదిలా ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కనీస మద్దతు ధర 50 శాతం పెంచుతామని, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ మూడేళ్లు మీన మేషాలు లెక్కించిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. మధ్యప్రదేశ్ రైతుల ఆందోళన.. ఆ పై గుజరాత్ రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన తర్వాత కళ్లు తెరిచింది. మూడేళ్లుగా రైతుల బాగోగులే పట్టించుకోని మోదీ సర్కార్.. ఎన్నికల వేళ రైతులకు మేలు చేయగలదా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

 తెలంగాణలో వరి, పత్తి కొనుగోళ్లపై హరీశ్ రావు ఇలా

తెలంగాణలో వరి, పత్తి కొనుగోళ్లపై హరీశ్ రావు ఇలా

రైతుల పంటకు కనీస మద్దతు ధర లభించాలంటే మార్కెట్‌లో వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ అధికారులు కుమ్మక్కు కాకుండా చర్యలు తీసుకోవాలి. పంటల సాగుకయ్యే ఖర్చుపై క్షేత్రస్థాయిలో సర్వే జరిపి గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లలో నిర్దిష్ఠ ధరకు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చారు. కొంత సమయం తీసుకున్న తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు నాణ్యత సాకుతో పక్కకు తప్పుకున్న పరిస్థితి నెలకొంది. వారు తప్పుకున్న తర్వాత వ్యాపార వర్గాలు తమ ఇష్టానుసారంగా ఏకపక్షంగా ధరలు నిర్ణయిస్తూ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తూనే ఉన్నది.

 కళ్లు తెరిపించిన మధ్యప్రదేశ్‌లో రైతు ఆందోళన.. గుజరాత్ ప్రజాతీర్పు

కళ్లు తెరిపించిన మధ్యప్రదేశ్‌లో రైతు ఆందోళన.. గుజరాత్ ప్రజాతీర్పు

గత ఏడాది మే, జూన్ నెలల్లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి ధర రూ.3000 మించి పెట్టకపోవడంతో కడుపు రగిలిన అన్నదాత ఆందోళన బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిన సంగతే. అలా తీవ్రంగా ఆందోళనకు దిగిన రైతులపై దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇటీవలే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడా గిట్టుబాటు ధర కల్పించాలన్నదే రైతుల డిమాండ్. అసలు సమస్యను పక్కనబెట్టి ఎమ్మెస్పీ 1.5 రెట్లు అమలు చేస్తామని విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఘనంగా ప్రకటించినంత మాత్రాన అమలులోకి వస్తుందంటే నమ్మడానికి అన్నదాతలు సిద్ధంగా లేరు. మరోవైపు రైతులు పంటల సాగులో వినియోగించే రసాయన ఎరువులపై 1991 నుంచి క్రమంగా సబ్సిడీ ఎత్తేస్తున్నది ఇదే కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ పేదలకు ఉపాది కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉద్దేశపూర్వకంగా నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తున్న ఘనత కూడా మోదీ సర్కార్‌దే అంటే అతి శయోక్తి కాదు.

 పెట్టుబడి, రైతు శ్రమతోపాటు వడ్డీనీ పరిగణనలోకి

పెట్టుబడి, రైతు శ్రమతోపాటు వడ్డీనీ పరిగణనలోకి

తీసుకోవాలన్న స్వామినాథన్
రైతు సాగుచేసే పంటల వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలని కొన్నేళ్లుగా రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, స్వచ్చంద సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే సాగు వ్యయాన్ని ఎలా లెక్కిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సాగుకయ్యే వ్యయాన్ని లెక్కగట్టిన పద్దతినే కొనసాగిస్తే యాభైశాతం అదనంగా ఇచ్చినా ప్రయోజనం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. వాస్తవంగా హెక్టారుకయ్యే సాగు ఖర్చు, ఆ రైతు కుటుంబం భూమిలో చేసిన శ్రమను పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుండగా, భూమి కౌలు ధర, సొంత పెట్టుబడి పెట్టినపుడు దానికయ్యే వడ్డీని కూడా లెక్కించాలని వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. మరోవైపు ప్రస్తుత విధానం లోపభూయిష్టంగా ఉందని, మార్పులు చేయాలనే అభిప్రాయం కూడా ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి సాగు వివరాలు తీసుకొని జాతీయ సగటు ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది.

 50 శాతం ఎమ్మెస్పీ పెంపు ఊసే ఎత్తని కేంద్రం

50 శాతం ఎమ్మెస్పీ పెంపు ఊసే ఎత్తని కేంద్రం

ఉదాహరణకు 2017లో క్వింటాల్ వరి సాగుకు రూ.2,158 ఖర్చవుతుందని, దీనికి యాభైశాతం కలిపి రూ.3,237 కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని తెలంగాణ కోరితే కేంద్ర కమిటీ మాత్రం సాగు వ్యయం, కుటుంబ శ్రమకు కలిపి క్వింటాల్‌కు రూ.1,117 మాత్రమే ఖర్చవుతుందని తేల్చింది. వరి పండించే అన్ని రాష్ట్రాలను లెక్కలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చింది. కౌలు, సొంత పెట్టుబడి వడ్డీ కలిపితే క్వింటాకు రూ.1,484 అవుతుందని అంచనాకు వచ్చింది. చివరకు క్వింటా ధర రూ.1,550గా నిర్ణయించింది. దీని ప్రకారం సాగు ఖర్చు, కుటుంబ శ్రమకు క్వింటాకైన ఖర్చు కంటే 38.76 శాతం అదనంగా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. తాజా నిర్ణయం ప్రకారం 50 శాతం పెంచినా మరో రూ.120 వరకు పెరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని, ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరతో సేకరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్న కమిటీ.. సాగు వ్యయం, కుటుంబశ్రమ, కౌలును కూడా పరిగణనలోకి తీసుకొని ధర నిర్ణయించినట్లుగా పేర్కొంది. అయితే యాభైశాతం గురించి ప్రస్తావించలేదు. జొన్న పంటకు వచ్చే సరికి మార్కెట్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని, సాగు వ్యయం, కుటుంబ శ్రమను మాత్రమే లెక్కలోకి తీసుకొన్నట్లు పేర్కొంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో విధానాన్ని కమిటీ అనుసరించింది.

 దేశవ్యాప్తంగా విభిన్నంగా పంటల సాగుపై నీతి ఆయోగ్ అధ్యయనం ఇలా

దేశవ్యాప్తంగా విభిన్నంగా పంటల సాగుపై నీతి ఆయోగ్ అధ్యయనం ఇలా

2017-18లో కనీస మద్దతు ధర నిర్ణయించినపుడు 2012-13 నుంచి 2014-15 వరకు వాస్తవ అంచనాలను పరిగణనలోకి తీసుకొంది. కొన్ని పంటల్లో సాగు వ్యయం, కుటుంబ శ్రమను మాత్రమే లెక్కించినా 46 శాతానికిపైగా లాభాలు వస్తున్నాయని, కొన్ని పంటలకు మాత్రమే తక్కువ వస్తుందని కూడా పేర్కొంది. 2017-18లో ధరల నిర్ణయ సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి అన్ని ప్రధాన పంటలు, ఒడిశా నుంచి వరి, బీహార్‌ నుంచి వరి, మొక్కజొన్న.. పంజాబ్‌ నుంచి వరి, పత్తి పంటలను పరిగణనలోకి తీసుకొంది. ఆంధ్రప్రదేశ్‌ పేర్కొన్న ఖర్చుకు, కమిటీ తీసుకొన్న ఖర్చుకు వ్యత్యాసం ఉండటానికి కారణం దిగుబడి తక్కువగా పేర్కొనడమేనని కమిటీ వ్యాఖ్యానించింది. పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తక్కువ దిగుబడి ఉన్నట్లు పేర్కొనడంతోపాటు సాగు ఖర్చులను ఎక్కువగా చూపినట్లు కమిటీ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో సాగు ఖర్చులు తక్కువగా ఉన్నాయి. ఇలా వాస్తవ సాగు ఖర్చులో తేడాలతో పాటు రాష్ట్రాలు పలు అదనపు ఖర్చులను చేర్చుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఇలాంటి అంశాలన్నింటిపైనా నీతిఆయోగ్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

చిన్న, సన్నకారు రైతులకు 21 శాతమే బ్యాంకు రుణాలు

చిన్న, సన్నకారు రైతులకు 21 శాతమే బ్యాంకు రుణాలు

ఎంఎస్‌పీ నిర్ణయంలోనే సమస్య ఉందని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌ రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. తీసుకోనప్పుడు ఆ తేడాలను రాష్ట్రాలే భరించాలన్నారు. కనీస మద్దతు ధర నిర్ణయ సమయంలో జీవన వ్యయాన్ని సరిగా లెక్కించడం లేదు.. ఇప్పుడిది చాలా ఎక్కువగా పెరిగింది. ధరల రూపంలోనే కాదు, మిగిలిన అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు. రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలివ్వాలి. వాస్తవ సాగుదారులకు సాయమందేలా ప్రభుత్వాల నిర్ణయాలుండాలి. బ్యాంకుల రుణాల్లో 21 శాతం మాత్రం సన్న, చిన్నకారు రైతులకు వెళ్తున్నాయి. కానీ సాగుదారుల్లో ఎక్కువమంది వీళ్లే. రైతు బతికేలా విధానాల్లో మార్పు వస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం కుటుంబ శ్రమ ప్లస్ వాస్తవ వ్యయంతో ఎమ్మెస్పీ నిర్ధారణ

ప్రస్తుతం కుటుంబ శ్రమ ప్లస్ వాస్తవ వ్యయంతో ఎమ్మెస్పీ నిర్ధారణ

తొలుత పంటల సాగు వ్యయం పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకు అవసరమైన సమాచారాన్ని ఆయా రాష్ట్రాల్లోని అర్థగణాంక శాఖ నుంచి సేకరిస్తారు. ఇందులో కూలీలు, ఎడ్లు, యంత్రాల వినియోగం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సత్తువ, నీటి తీరువాలను లెక్కలోకి తీసుకుంటారు. వాటి వినియోగాన్ని బట్టి ప్రాధాన్యమిస్తారు. అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమిటీ ఓ నిర్ణయానికి వస్తుంది. దీనినే వాస్తవ వ్యయంగా పరిగణిస్తారు. భూమి సాగుకు చెల్లించే మొత్తం, సొంతంగా పెట్టిన పెట్టుబడికి వడ్డీని పరిగణనలోకి తీసుకోవడాన్నివాస్తవ వ్యయంగా పరిగణిస్తున్నారు. ఈ మూడింటిని కలిపి కనీస మద్దతు ధరగా నిర్ణయించడంతోపాటు, దీనిపై యాభై శాతం అదనంగా చెల్లిస్తేనే వ్యవసాయం లాభదాయకం అవుతుందని ఆచార్య ఎం.ఎస్‌.స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ రైతు సంక్షేమ కమిషన్‌ సిఫార్సు చేసింది. ప్రస్తుతం వాస్తవ వ్యయం, కుటుంబ శ్రమను లెక్కలోకి తీసుకొని మద్దతు ధర నిర్ణయిస్తున్నారు.

రాష్ట్రాల వారీ నివేదికలపై కలగలిపి ఇలా సీసీఈఏ నిర్ణయం

రాష్ట్రాల వారీ నివేదికలపై కలగలిపి ఇలా సీసీఈఏ నిర్ణయం

కేంద్రప్రభుత్వం 26 పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి ప్రముఖ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఛైర్మన్‌గా కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల అర్థగణాంక శాఖల ద్వారా సాగు వివరాలు తీసుకుని, క్షేత్రస్థాయి అంశాలను సాగుదారుల నుంచి సేకరిస్తుంది. ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో సాగు వ్యయం, భూమి ధరలు ఇలా అన్నింటి ఆధారంగా పంటల వారీగా క్వింటాకు ఎంత ధర నిర్ణయించాలో కోరతాయి. అన్ని రాష్ట్రాల వివరాలు తీసుకోవడంతోపాటు తాము సేకరించిన వివరాల ఆధారంగా కమిటీ కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తుంది. దీని ఆధారంగా కేంద్ర ఆర్థిక వ్యవహరాల క్యాబినెట్ కమిటీ ‌(సీసీఈఏ) నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీ మొత్తం 11 అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది. ఇందులో ఉత్పత్తి వ్యయం, డిమాండ్‌-సరఫరా, మార్కెట్‌పై ధరల ప్రభావం, అంతర్జాతీయంగా ధరల పరిస్థితి తదితర అంశాల ఆధారంగా ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

English summary
The Union Budget for 2018-19 has promised to fix minimum support prices (MSP) for crops to guarantee farmers at least 50 per cent returns on production costs. This is quite similar to the original recommendation of the M S Swaminathan-headed National Commission on Farmers (which called for MSPs to be “at least 50% more than the weighted average cost of production”) and the BJP’s 2014 Lok Sabha Election Manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X