వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: రుణ పరపతి కావాలి.. మల్టీబ్రాండ్‌నూ అనుమతించాలి.. ఇవీ ‘రిటైల్’ అప్పీళ్లు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ, కమ్యూనికేషన్ల వ్యవస్థలో సమూల మార్పులతో ఇంటర్నెట్‌తో సమూల మార్పులు జరిపే పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే, బస్సు, విమాన టిక్కెట్ల రిజర్వేషన్ నుంచి వస్తువుల కొనుగోళ్లు.. అదీ రోజువారీ ఇళ్లలో వాడే వస్తువుల కొనుగోళ్లకు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ పోర్టళ్ల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న రిటైల్‌ రంగం తమకూ 'పరిశ్రమ' హోదా ఇవ్వాలని ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది.

దీనివల్ల రుణాలు సులభతరం కావడంతో పాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నది ఈ రంగం భావన. జీఎస్‌టీ వ్యవస్థను సరళతరం చేయాలని కోరుతోంది. అలాగే మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోనూ ఎఫ్‌డీఐలను ఆహ్వానించించేందుకు నిబంధనలను సరళతరం చేయాలని అభ్యర్థిస్తోంది.

ఆర్థిక మంత్రికి రిటైల్ రంగం అభ్యర్థనలిలా..

ఆర్థిక మంత్రికి రిటైల్ రంగం అభ్యర్థనలిలా..

ఇతర రంగాల మాదిరిగానే సహకారం, ప్రోత్సాహకాలు అందుకునేందుకు వీలు కల్పించాలని రిటైల్ పరిశ్రమ కోరుతోంది. చిన్న వ్యాపారులకు అందుబాటు ధరలో డిజిటల్‌, కార్డ్‌ చెల్లింపుల స్వీకరణ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను అందించాలని అభ్యర్థిస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులకు జీఎస్టీ రిఫండ్‌లు సత్వరం మంజూరు చేసి, పర్యాటకంతోపాటు రిటైల్‌ రంగాన్ని ప్రోత్సహించాలి. ఇక వ్యక్తిగత వినియోగం పెరిగేలా, ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఇవ్వాలని అభ్యర్థనలు వెలువడుతున్నాయి. వినియోగం అధికమైతే, ఆర్థిక వ్యవస్థకు బహువిధాలా మేలు జరుగుతుందంటున్నారు. సింగిల్ విండో పద్దతిలో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌ యజమానులకు అనుమతులివ్వాలి. మాల్స్ నిర్మాణం, నిర్వహణలో స్థిరాస్తి, రిటైల్‌, ఆతిథ్య రంగాలు కలిసి ఉంటున్నందున లైసెన్సుల కోసం వేర్వేరు విభాగాల చుట్టూ ప్రదక్షిణలు నివారించాలి.

 గతేడాది వరకు రిటైల్‌లోకి 1.04 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ

గతేడాది వరకు రిటైల్‌లోకి 1.04 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ

2016లో 641 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41.66 లక్షల కోట్ల) వ్యాపారం సాగిస్తున్న చిల్లర వ్యాపార రంగం 2026కు 1.6 లక్షల కోట్ల డాలర్ల (రూ.104 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సంఘటితంగంలో చిల్లర వ్యాపారం వాటా 10 శాతమే కాగా, ఇది 20 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్‌ వ్యాపారం కూడా సాధారణ విక్రయాలతో సమాన స్థాయికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2000 నుంచి గతేడాది వరకు 1.04 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6,700 కోట్ల) వరకు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

వైద్యం ఖర్చుల మినహాయింపు రూ.45 వేలకు పెంచాలి

వైద్యం ఖర్చుల మినహాయింపు రూ.45 వేలకు పెంచాలి

ప్రస్తుతం నర్సరీ నుంచే ఫీజులు రూ. వేలల్లో ఉంటున్నాయి. ఇక ఉన్నత విద్య గురించి చెప్పనక్కర్లేదు. భారీ మొత్తంలో డబ్బులు అవసరం పడుతుండటంతో చాలా మంది రుణాల బాట పడుతున్నారు. అందుకే ఇటీవల విద్యా రుణాలకు గిరాకీ అధికంగా ఉంటోంది. విద్యా రుణాలపై చెల్లించిన వడ్డీని 80ఈ సెక్షన్‌ ప్రకారం పన్ను కోత రూపేణా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాన్ని కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే పొందే వీలు ఉన్నది. అయితే ఈ ఎనిమిదేళ్ల గడువు ఏ మాత్రం సరిపోదనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఈ ప్రయోజనాన్ని రుణ కాల పరిమితి పూర్తయ్యే వరకు కొనసాగించాలని కోరుకుంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం వైద్యానికి అవుతోన్న ఖర్చులు మామూలు స్థాయిలో లేవు. ఏ చిన్నపాటి రోగానికైనా ఆస్పత్రుల్లో అడుగుపెట్టారంటే బిల్లు మోత మోగుతుంది. వైద్యం ఖర్చును రీయింబర్స్‌మెంట్‌ కింద తిరిగి పొందిన (రీయింబర్స్‌మెంట్‌) కూడా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఇలా పొందిన మొత్తం రూ.15,000 కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాలి. అందుకే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ.15 వేలనుంచి రూ.45 వేలకు పెంచమని కోరుతున్నారు.

 ఐటీలో శ్లాబులు సవరించాలని ఆర్థికశాఖకు ఇలా అభ్యర్థనలు

ఐటీలో శ్లాబులు సవరించాలని ఆర్థికశాఖకు ఇలా అభ్యర్థనలు

పెరుగుతున్న ధరలతోపాటు జీఎస్‌టీ అమలు తదితర అంశాల దృష్ట్యా చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ప్రస్తుత పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం పునఃస్సమీక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.3- 3.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే పన్ను మినహాయింపుతో మిగిలే డబ్బులను ఇతరత్రా పెట్టుబడి మార్గాలకు వెచ్చించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు పన్ను ఎగవేతకు కొంతైనా అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత బడ్జెట్లో రూ.2.5 లక్షలు- 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేటును 5 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు కూడా ఈసారి పన్ను రేట్లలో తగ్గింపును ఆశిస్తున్నారు. 5 శాతం పన్ను రేటుకు వార్షికాదాయ శ్లాబ్‌ను రూ.3 - 7 లక్షలకు పెంచొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే రూ.12 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి 30%, రూ.7 లక్షలు- 12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 20% పన్ను శ్లాబ్‌లను వర్తింప చేయొచ్చని భావిస్తున్నారు. ఇక రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రిటర్న్‌ల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది.

 టర్మ్ బీమా పాలసీలపై ప్రత్యేక మినహాయింపు కోసం అప్పీళ్లు

టర్మ్ బీమా పాలసీలపై ప్రత్యేక మినహాయింపు కోసం అప్పీళ్లు

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)తో పోలిస్తే ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌లు) వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం పీపీఎఫ్‌ ఉపసంహరణ సమయంలో ఎలాంటి పన్నులు వర్తించవు. అదే ఎన్‌పీఎస్‌లో నిధుల ఉపసంహరణకు వర్తిస్తుంది. అందుకే ఎన్‌పీఎస్‌‌లోనూ మరిన్ని పెట్టుబడులు రావాలంటే ఈ పథకంలో నిధుల ఉపసంహరణకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఎంతో కొంత ప్రతిఫలం వస్తుందన్న ఆశతోనే కదా ఎవరైనా మదుపు చేసేది. ఆ వచ్చే ప్రతిఫలంలో కొంత మొత్తం పన్ను చెల్లింపులకు పోతే, పెద్దగా గిట్టుబాటయ్యేదేమీ ఉండదని చెప్తున్నారు. దేశంలో ఎల్ఐసీతోపాటు ప్రైవేట్ బీమా సంస్థలు ఎంతగా విస్తరించినా దేశంలో వాటి సేవలు అంతంతమాత్రమేనన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బీమా సేవల విస్తరణను వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రస్తుతం బీమా పథకాల్లో పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం 80సి సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.1.5 లక్షలుగా ఉంది. మరింత మంది బీమా పథకాల వైపు మొగ్గు చూపాలంటే ఈ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రీమియం తక్కువగా ఉండే టర్మ్‌ పాలసీలకు ప్రత్యేక మినహాయింపు పరిమితిని బడ్జెట్‌లో ప్రతిపాదించాలని అడుగుతున్నారు.

ఇంటి బీమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థనలు

ఇంటి బీమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థనలు

అందరికీ గృహ వసతి కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. అయితే ఓ వైపు పెరుగుతున్న జనాబా, మరోవైపు డిమాండ్- సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతుండటం సొంతింటి కల నెరవేర్చడం సవాలుతో కూడుకున్నదే. అయితే 'ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 80 ఈఈ' ప్రకారం తొలిసారి ఇంటిని కొనుగోలు చేసిన వాళ్లు 2016 ఏప్రిల్‌ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య రుణాన్ని పొంది ఉంటే అదనంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు కోరేందుకు వీలు కల్పిస్తోంది. ఈ వెసులుబాటును గతేడాది మార్చి తర్వాత రుణం తీసుకున్నవారికి కల్పించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం ఇంటి నిర్మాణ వ్యయం భారీగా ఉంటోంది. ఇళ్లు కొనడంతోనే పని పూర్తి కాదు.. గృహ సామగరి‌, ఇతరత్రా అలంకరణ సామగ్రి కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చవుతోంది. ఇంత విలువైన సామాన్లు ఉన్నప్పుడు ఇంటికి బీమా చేయడం కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం గృహ బీమాకు పన్ను మినహాయింపు లేకపోవడం ఒకింత ఇబ్బందికరమే. ఇంటి బీమాకు ప్రత్యేక సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదన ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఈ సారి బడ్జెట్‌లోనైనా పన్ను మినహాయింపుపై నిర్ణయం తీసుకుంటే మరింత మంది గృహ బీమా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం బీమా సేవల విస్తరణకు కూడా దోహదం చేస్తుంది.

‘డెట్ ఎంఎఫ్‌'లా పన్ను విధానం అమలుకు డిమాండ్లు

‘డెట్ ఎంఎఫ్‌'లా పన్ను విధానం అమలుకు డిమాండ్లు

బ్యాంకుల్లో వివిధ గడువులకు అనుగుణంగా డిపాజిట్లు చేస్తూ ఉంటారు. కాలపరిమితి పూర్తి కాగానే వచ్చే వడ్డీ మీద మూలం వద్ద పన్ను విధింపులో మినహాయింపు పరిమితి రూ.10,000కి మాత్రమే పరిమితం. దాదాపు 20 ఏళ్లుగా ఇదే పరిమితినే కొనసాగిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రజల ఆదాయాల్లో గణనీయ వ్యత్యాసం వచ్చింది. సంపద పెరిగింది. పొదుపు చేసే విధానంలోనూ మార్పులు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలకి తీసుకొని పై పరిమితిని పునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అయితే నోట్ల రద్దు అనంతరం డిపాజిట్ రేట్లు బాగా తగ్గాయి. మరోవైపు డిపాజిట్ల ద్వారా పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుండటంతో గిట్టుబాటు అవుతున్న ప్రతిఫలం కూడా తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 30 శాతం పన్ను శ్లాబులో ఉంటే డిపాజిట్లపై కనీసం 7-8% వడ్డీని పొందినా కూడా ఆయనకు పన్నులు పోగా గిట్టుబాటు అయ్యేది 5% లోపే ఉంటోంది. అందుకే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ల మాదిరిగా డిపాజిట్లకు పన్ను విధానాన్ని అమలు వర్తింపజేయాలని కోరుతున్నారు.

 జీఎస్టీలో పన్ను శ్లాబ్ తగ్గింపుపై వాహన రంగం ఇలా

జీఎస్టీలో పన్ను శ్లాబ్ తగ్గింపుపై వాహన రంగం ఇలా

కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తామన్న ప్రభుత్వం గతేడాది పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై ప్రోత్సాహకాల్లో కోత విధించిది. ఆర్‌ అండ్‌ డీపై భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో తిరిగి ప్రోత్సాహకాలను ఇవ్వాలని వాహన రంగం కోరుకుంటోంది. అదే విధంగా 2030 కల్లా 100 శాతం విద్యుత్‌ వాహనాలను రోడ్లపైకి తేవాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్న నేపథ్యంలో ఆరేళ్ల పాటు ఫేమ్‌ పథకాన్ని(రెండో విడత) తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తోంది. అదే విధంగా ప్రస్తుత పన్ను విధానాలను సరళీకరించాలనీ అంటోంది. వెయిటెడ్‌ పన్ను తగ్గింపు రూపంలో పరిశోధన-అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి ప్రోత్సాహకాలను తిరిగి ఇవ్వాలని, ‘ఆర్‌ అండ్‌ డీ'పై భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కార్పొరేట్‌ పన్నును తగ్గించని పక్షంలో కనీసం ప్రోత్సాహకాలైనా ఇవ్వాలని వాహన రంగం కోరుతోంది. విద్యుత్‌ వాహన విడిభాగాల దిగుమతి విషయంలో పన్నులపై స్పష్టతనివ్వాలని, ఒక్కసారి దిగుమతి చేసుకున్న తర్వాత తప్పటడుగు పడకుండా చూడాలని అభ్యర్థిస్తోంది. రవాణా వ్యయాలను తగ్గించి, జల రవాణాను ప్రవేశ పెట్టాలని, ఆధునిక రైలు రవాణాను మెరుగుపరచాలన్న సూచనలు వ్యక్తం అవుతున్నాయి. ఫేమ్ ‌(ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌) పథకంలో మలి విడతను ప్రవేశపెట్టాలని, జీఎస్టీలో ప్రస్తుత 28 శాతం పన్ను శ్లాబ్‌ను 20 శాతానికి తగ్గించాలని వాహన విడి భాగాల రంగం కోరుతోంది.

English summary
In the run up to the budget, retailers have asked the government to simplify GST system and grant industry status to the sector for easier access to finance and attract more investments. Besides, the industry is also seeking relaxed FDI regime for multi-brand retail trade (MBRT) as also incentives to be provided for setting up warehousing and cold-chain storage facilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X