ఎండ పెరిగితే అకౌంట్లోకి డబ్బులా? ఏంటో ఈ ‘హీట్ ఇన్సూరెన్స్’!

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుంటుంది. కాస్త జరుగుబాటు ఉన్నవాళ్లు ఏసీ గదుల్లోనో, కూలర్ల ముందో కాలం వెళ్లదీస్తారు. కానీ, బయటకెళ్లి రెక్కాడితే గాని డొక్కాడని అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి ఏంటి? ఎండ తీవ్రత 44 డిగ్రీలు దాటినా.. పొట్టకూటి కోసం రోడ్డుపైకి రాక తప్పని పరిస్థితి. ఇలాంటి తరుణంలో, ఎండ తీవ్రత వల్ల ఉపాధి కోల్పోయే పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక సరికొత్త విప్లవాత్మకమైన భరోసా అందుబాటులోకి వచ్చింది. అదే 'హీట్ వేవ్ ఇన్సూరెన్స్' (ఎండల బీమా). సాంప్రదాయ బీమా రంగంలో సరికొత్త మైలురాయిగా నిలుస్తున్న ఈ పాలసీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాల్లో ఆశాకిరణంగా మారుతోంది.

సాధారణంగా ఇన్సూరెన్స్ అనగానే ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్‌లో చేరితేనో, లేదా ప్రాణనష్టం జరిగితేనో కంపెనీల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరగడం మనకు తెలుసు. కానీ ఈ 'హీట్ ఇన్సూరెన్స్' పూర్తి భిన్నమైనది. ఇది 'పారామెట్రిక్' (ఇండెక్స్ ఆధారిత) నమూనాపై పనిచేస్తుంది. అంటే, ఇందులో ఎలాంటి క్లెయిమ్ ఫారాలు, మెడికల్ బిల్లులు, వెరిఫికేషన్లు ఉండవు. భారత వాతావరణ శాఖ (IMD) లేదా శాటిలైట్ డేటా ప్రకారం.. ఒక నిర్దేశిత ప్రాంతంలో ఉష్ణోగ్రత ముందే నిర్ణయించిన పరిమితిని (ఉదాహరణకు 43°C లేదా 45°C) దాటి వరుసగా రెండు, మూడు రోజులు నమోదైతే చాలు, పాలసీదారుల అకౌంట్లలోకి నేరుగా రూ.300 నుండి రూ.3,000 వరకు (పరిస్థితిని బట్టి గరిష్ఠంగా రూ.7,000 వరకు) నగదు ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయిపోతుంది.

Heatwave Insurance In India How This Smart Micro-Policy Pays Daily Wage Workers When Temperatures Rise

కుటుంబానికి జీవన భృతిగా..

ఈ వినూత్న మైక్రో-ఇన్సూరెన్స్ విధానం ముఖ్యంగా మహిళలు, రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లకు కొండంత అండగా నిలుస్తోంది. ఎండ తీవ్రత వల్ల పనులకు వెళ్లలేక ఆదాయం కోల్పోయినప్పుడు, ఈ ఇన్సూరెన్స్ ఇచ్చే డబ్బు వారి కుటుంబానికి జీవన భృతిగా మారుతుంది. అంతేకాదు, వడదెబ్బ, డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు ఓపీడీ (OPD) ఖర్చులకు, వేసవిలో విపరీతంగా పెరిగే కరెంట్ బిల్లుల భారాన్ని తట్టుకోవడానికి కూడా ఈ సాయం ఎంతో ఉపకరిస్తుంది.

పైలట్ ప్రాజెక్ట్‌గా..

మనదేశంలో సుమారు 76 శాతం జనాభా తీవ్రమైన ఎండల ముప్పును ఎదుర్కొంటున్నారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 'సేవ' (SEWA) వంటి మహిళా సంక్షేమ సంస్థలు ఐసీఐసీఐ లాంబార్డ్, స్విస్ రే వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కోల్‌కతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ నయా బీమాని మొదలుపెట్టి, దాదాపు 48 వేల మంది మహిళా కార్మికులకు ప్రయోజనం చేకూర్చాయి. బిహార్ ప్రభుత్వం సైతం 'క్లైమేట్ రెజిలియన్స్ ఫర్ ఆల్' సంస్థతో కలిసి పాట్నా, గయా ప్రాంతాల్లోని కూలీలకు ఈ రక్షణ కల్పిస్తోంది. కేరళలో పాడి రైతులకు వేసవిలో పాలు తగ్గినప్పుడు నష్టపరిహారం ఇచ్చేలా కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా దీనిని విస్తరించారు.

ప్రస్తుతం ఈ బీమా సదుపాయం ఏడాది పొడవునా కాకుండా, కేవలం ఎండలు ఎక్కువగా ఉండే మార్చి నుండి జూన్ మధ్య మాత్రమే వర్తిస్తుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా ఈ ప్రీమియం భారాన్ని (సగటున ఒక్కొక్కరికి రూ.900 వరకు) భరిస్తుండడం విశేషం.

'కూలింగ్ పాయింట్స్' ఏర్పాటు..

మరోవైపు, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థలు నేరుగా నగదు ఇవ్వకపోయినా, తమ డెలివరీ పార్ట్‌నర్స్ కోసం నగరాల మధ్యలో ఏసీలు, కూలర్లు, గ్లూకోజ్ ప్యాకెట్లతో 'కూలింగ్ పాయింట్స్' ఏర్పాటు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో.. నష్టం జరిగాక ఆదుకోవడం కాదు, నష్టం జరుగుతున్నప్పుడే వెన్నుదన్నుగా నిలిచే ఈ 'ఎండల బీమా' భవిష్యత్తులో ప్రతి సామాన్యుడికీ ఒక అత్యవసర సామాజిక భద్రతా వలయంగా మారబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+