వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్బీ చీటింగ్: సత్యం కంప్యూటర్స్’ను మించిన మాయ.. ఆర్బీఐ మొద్దు నిద్ర?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముంబై: తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) శాఖలో వెలుగు చూసిన నయా మోసం భారతీయ బ్యాంకింగ్ రంగంలోనే.. ఆ మాటకు వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థలోనే అతిపెద్ద కుంభకోణంగా మిగిలిపోనున్నది. 2009లో వెలుగులోకి వచ్చిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో రూ.9000 కోట్ల మేరకు మోసం జరిగినట్లు నాటి సత్యం కంప్యూటర్స్ సంస్థ అధినేత బైర్రాజు రామలింగరాజు బయటపెట్టారు.
తర్వాత 2015లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సహచర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లోని ఢిల్లీ శాఖలో ఇద్దరు హస్తిన కేంద్రంగా వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యాపార వేత్తలు జరిపిన మోసం విలువు అక్షరాల రూ.6000 కోట్లు. అప్పట్లో అది అమెరికా డాలర్లలో గణిస్తే బిలియన్ డాలర్ల కంటే తక్కువ.
అప్పట్లోనే బ్యాంకింగ్‌లో పలు అవకతవకలు చోటుచేసుకుంటున్న అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టికి వచ్చింది. 2015లో బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూఢిల్లీ అశోక్ విహార్ బ్రాంచ్‌లో చేటుచేసుకున్న రూ.6,100 కోట్ల దిగుమతుల చెల్లింపుల కుంభకోణంపై ఆర్బీఐ జరిపిన పరిశీలనలో తాజా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద లావాదేవీల రిపోర్టుల (ఎస్‌టీఆర్) ఫైలింగ్‌లు సమర్పించకపోవడం, సమర్పించినా తీవ్ర ఆలస్యం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) మార్గదర్శకాలు పాటించకుండానే అకౌంట్ల ప్రారంభం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయని ఆర్బీఐ తేల్చింది.

యధాతథ స్థితిపై నివేదిక పంపాలని తాజాగా ఆర్బీఐ ఆదేశం

యధాతథ స్థితిపై నివేదిక పంపాలని తాజాగా ఆర్బీఐ ఆదేశం

2015లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మోసం ఉదంతం తరువాత అన్ని వాణిజ్య బ్యాంకుల చైర్మన్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లకు లేఖ రాసిన ఆర్‌బీఐ ప్రస్తుత విధానాలపై సమీక్ష జరపాలని ఆదేశించింది. ఎటువంటి అవకతవకలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్బీఐ సూచించింది. పీటీఐ ఫైల్ చేసిన ఒక ఆర్‌టీఐ ప్రశ్నకు సమాధానంగా అందిన ఆర్‌బీఐ లేఖ ప్రతి ద్వారా ఈ అంశాలు తెలిశాయి. వివిధ బ్యాంకులనుంచి అంతర్గత ఆడిట్ నివేదికలను తెప్పించుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ తెలిపింది.తాజాగా పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అన్ని బ్యాంకులను యధాతథ స్థితిపై నివేదికలను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆర్బీఐ హుకుం జారీ చేసింది. కాకపోతే నీరవ్ మోదీ వంటి వారు కుటుంబ సమేతంగా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత స్పందించడమే కొసమెరుపు. సత్యం కంప్యూటర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కుంభకోణాలతోపాటు కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థల స్టాక్‌ల పతనం ఒకసారి పరిశీలిద్దాం.

రెండు దశాబ్దాల్లోనే ఇంతింతై వటుడింతై అన్నట్లు..

రెండు దశాబ్దాల్లోనే ఇంతింతై వటుడింతై అన్నట్లు..

కొత్త సహస్రాబ్ది తొలి దశకంలో ఓ వెలుగు వెలిగింది సత్యం కంప్యూటర్స్ సంస్థ. సంస్థ వ్యవస్థాపకుడు, అధినేత బైర్రాజు రామలింగరాజు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్‌ భారత ఐటి రంగానికే చుక్కానిగా ఒక వెలుగు వెలిగారు. నాడు అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి విద్య అభ్యసించిన వారెవరైనా సత్యంలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారు. అంతర్జాతీయ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కన్నా కూడా సత్యం కంప్యూటర్స్‌కే విలువ ఎక్కువ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు వేదికపై ఆయన సరసన రామలింగరాజు కూచోగలిగారన్నా అందుకు సత్యం కంప్యూటర్స్‌ ద్వారా ఆయన ఆర్జించిన పేరు ప్రతిష్ఠలే కారణం. అంతర్జాతీయ ఐటి చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క కంపెనీకి కూడా స్థానం లేని రోజుల్లో స్థాపించిన సత్యం కంప్యూటర్స్‌ రెండు దశాబ్దాల వ్యవధిలోనే ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిపోయింది.

మేటాస్ డీల్ ప్రకటించినప్పుడూ చెలరేగిన దుమారం

మేటాస్ డీల్ ప్రకటించినప్పుడూ చెలరేగిన దుమారం

2007 నాటికి 52 వేలకు పైబడిన ఉద్యోగులతో 12,600 కోట్ల రూపాయల (210 కోట్ల డాలర్లు) ఆదాయాలతో దేశంలో నాలుగో అతి పెద్ద ఐటి కంపెనీ అన్న హోదాను సత్యం కంప్యూటర్స్ దక్కించుకున్నది. 1992 మే 5న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైంది. 1999లో నాస్‌డాక్‌లో, 2001లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలోకి ప్రవేశించింది.అసలు రామలింగరాజు లేని సత్యంను ఊహించనేలేమని ఆ సంస్థలో పని చేసిన ఉద్యోగులు చెబుతూ ఉండేవారు. 2008 చివరిలో ఆయన మేటాస్‌ డీల్‌ను ప్రకటించినప్పుడు చాలా దుమారం చెలరేగింది. అయినా ఆ సమయంలో సత్యం ఉద్యోగులు, ఆ సంస్థలో అధిక వాటాలున్న అబెర్డీన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రతినిధులు ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ ఇన్ని ఘనతలు సాధించిన కంపెనీ నెల తిరక్కుండానే అదే వ్యక్తి చేతిలో మసకబారిపోయి చరిత్ర పుటల్లో కలిసిపోయింది.

రాజు ప్రకటనతో నివ్వెరపోయిన ప్రపంచం

రాజు ప్రకటనతో నివ్వెరపోయిన ప్రపంచం

2009 జనవరి ఏడో తేదీన రామలింగరాజు ఆశ్చర్యకరంగా తమ కంపెనీలో భారీ కుంభకోణం జరిగిందని షేర్‌హోల్డర్లకు, స్టాక్‌ ఎక్స్ఛేంజిలకు లేఖ రాయడంతో ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు కూడా ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ రామలింగరాజు లేని సత్యంను ఊహించనైనా లేమని తేల్చి చెప్పిన రెండు రోజుల వ్యవధిలోనే రామలింగరాజు ఆర్థిక వ్యవహారాల్లో తన ఘోర తప్పిదాల్ని అంగీకరిస్తూ సెబికి, స్టాక్‌ ఎక్స్ఛేంజిలకు పంపిన లేఖలో కంపెనీ వాస్తవ నగదు నిల్వ 321 కోట్లుండగా దాన్ని కొన్ని రెట్లు ఎక్కువ చేసి 5040 కోట్ల రూపాయలుగా చూపించామని, 376 కోట్ల మేరకు రాని వడ్డీ వచ్చినట్టుగాను చూపించామని, 1230 కోట్ల రూపాయల మేరకు అప్పుల్ని కప్పిపెట్టామన్న వాస్తవాన్ని బట్టబయలు చేశారు. ఇది కాకుండా షేర్లు తాకట్టు పెట్టి తీసుకువచ్చిన 1200 కోట్ల రూపాయలను కూడా కలిపితే తమ సంస్థలో జరిగిన అక్రమాల పరిమాణం ఏడు వేల కోట్ల రూపాయలకు పైబడే ఉన్నట్టు ఆయన తేల్చారు. ఈ లోటును పూడ్చేందుకు, తన తప్పిదాలు బయటకు పొక్కకుండా చూసేందుకు చివరి ప్రయత్నంగా మేటాస్‌ ఒప్పందాన్ని తెర పైకి తెచ్చానని, అది కూడా బెడిసికొట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపారు.

ఇలా సత్యం.. కింగ్ ఫిషర్స్ షేర్ పతనం

ఇలా సత్యం.. కింగ్ ఫిషర్స్ షేర్ పతనం

ఇలా సత్యం కుంభకోణం దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ కుంభకోణంగా చరిత్రపుటలకెక్కింది. నాడు సత్యం కంప్యూటర్స్ షేర్ రూ.542 నుంచి రూ.58కి పడిపోయిన తర్వాత ప్రభుత్వం ద్వారా టెక్ మహీంద్రా కొనుగోలు చేసి తనలో విలీనం చేసుకున్నది. ఇలా సత్యం కంప్యూటర్స్ చరిత్ర అంతర్జాతీయ ఐటీ రంగం నుంచి కనుమరుగైంది. మరోవైపు కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం సిబ్బంది వేతనాలు చెల్లించక, బ్యాంకుల వద్ద తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకుండా దాటేస్తూ మోసగించేందుకు పూనుకున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ నియంత్రణ సంస్థలన్నీ ఆంక్షలు విధించాయి. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయి కూడా. ఈ క్రమంలో కింగ్ ఫిషర్స్ షేర్ ట్రేడింగ్‌ను స్టాక్ మార్కెట్లు తాత్కాలికంగా నిలిపేసినప్పుడు దాని షేర్ విలువ రూపాయికి పడిపోయింది.

కస్టమ్స్ డ్యూటీల ఎగవేత, అక్రమ చెల్లింపులతో ఇలా

కస్టమ్స్ డ్యూటీల ఎగవేత, అక్రమ చెల్లింపులతో ఇలా

ఢిల్లీలోని అశోక్ విహార్‌లో గల బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో రూ. 6,000 వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులోని 59 మంది కరెంట్‌ అకౌంట్‌ హోల్డర్లు, పలువురు బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై విదేశాలకు అక్రమ చెల్లింపులు, కస్టమ్స్‌ డ్యూటీల ఎగవేతకు పాల్పడి సుమారు 6 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. బ్యాంకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ లక్ష డాలర్ల లోపు మొత్తాలుగా విడగొట్టి వివిధ అకౌంట్లలో చెల్లించడం ద్వారా ఆటోమేటిక్‌ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ దృష్టి నుంచి తప్పించుకున్నారని సీబీఐ అందులో పేర్కొంది. 2014-15 మధ్య ఇలాంటి లావాదేవీలు సుమారు 8 వేల వరకు జరిగినట్లు సీబీఐ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మనీ లాండరింగ్ కుంభకోణంలో మొత్తం 59 నకిలీ కంపెనీలకు భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఈ కుంభకోణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా జరిగే లావాదేవీకి డాలరుకు 30- 50 పైసలు కమీషన్‌ తీసుకొని హెచ్ డీఎఫ్‌సీ ఉద్యోగి సాయం చేసినట్లు ఈడీ వెల్లడించింది. వీరిలో భాటియా నకిలీ కంపెనీలను సృష్టించడంలో కీలకమని, ధావన్‌ రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతిదారని తెలిపింది. వీరు అగర్వాల్‌తో కలిసి అశోక్‌ విహార్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌ ద్వారా రూ. 430 కోట్ల విలువైన విదేశీ చెల్లింపులను అతితక్కువ కాలంలో మాయం చేసారని తెలిపింది. దీనికి తోడు ధావన్‌ 6-7 నెలల కాలంలో రూ. 15 కోట్ల కస్టమ్స్‌ డ్యూటీని డ్రా బ్యాక్‌ చేసినట్లు తెలిపింది.

కరిగిపోయిన సంపదతో మదుపర్ల గగ్గోలు

కరిగిపోయిన సంపదతో మదుపర్ల గగ్గోలు

తాజాగా మరో ‘నయా మోసం' కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు గురువారం పీఎన్‌బీ షేరు మరో 12 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో రూ. 128.35కి పడిపోయింది. స్కాం బైటపడిన బుధవారం నాడు షేరు సుమారు పది శాతం క్షీణించింది. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే బ్యాంకు మార్కెట్‌ విలువ ఏకంగా రూ. 8,077 కోట్ల మేర కరిగిపోయింది. ఇది పీఎన్‌బీ వార్షిక లాభానికి ఆరు రెట్లు పైగా కావడం గమనార్హం. షేరు రెండు రోజుల పతనంతో గురువారం పీఎన్‌బీ మార్కెట్‌ విలువ రూ. 31,132 కోట్లకు పడిపోయింది. మరోవైపు, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు కూడా క్షీణించాయి. గురువారం బీఎస్‌ఈలో 4.30 శాతం తగ్గి రూ. 1,199 వద్ద ముగిశాయి. పీఎన్‌బీ నుంచి పొందిన లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ని అడ్డం పెట్టుకుని బ్యాంకులను రూ. 11,400 కోట్ల మేర బిలియనీర్‌ నీరవ్‌ మోదీ బురిడీ కొట్టించిన సంగతి తెలిసిందే. స్కాం బైటపడిన బుధవారం షేర్లలో అమ్మకాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 20,000 కోట్ల మేర క్షీణించింది.నీరవ్‌ మోదీతో లింకుల వల్ల గీతాంజలి జెమ్స్‌ సంస్థ షేర్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. కుంభకోణం బైటపడిన తర్వాత గీతాంజలి జెమ్స్‌ షేర్లలో రెండు రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సుమారు రూ. 130 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. ఫిబ్రవరి 12న దాదాపు రూ. 745 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువ గురువారం ఉదయం సెషన్లో రూ. 612 కోట్ల స్థాయికి పడిపోయింది.

English summary
The Punjab National Bank (PNB) shares plunged 11.97% on Thursday to close at Rs. 128.35, a day after the scrip lost nearly 10% in the market capitalisation after a colossal banking fraud was brought to light. The fraud amounts to the tune of $1.77 billion in which the billionaire jeweller Nirav Modi allegedly acquired fraudulent letters of undertaking (LoU) from one of its branches for overseas credit.This could be the biggest banking fraud in India as its quantum was bigger than an estimated 9,000 crore scam at erstwhile Satyam computers. In 2015, Bank of Baroda -- another public sector bank -- had brought to light a scam in which two Delhi-based businessmen cheated it of Rs. 6,000 crore (slightly less than $1 billion at that time).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X