వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ్డీరేట్లు యధాతథం: కానీ ఆ పన్నులతో సవాలే.. ద్రవ్యోల్బణం రిస్కులు ఉన్నాయన్న ఆర్బీఐ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన భారతీయ రిజర్వు బ్యాంకు.. పెట్టుబడిపై అయిదు రకాల పన్నులు విధించడంతో పెట్టుబడులు, పొదుపుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్‌పై టాక్స్ (ఎల్‌టీసీజీ) విధిస్తూ విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదనలు సమర్పించడంపై విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

దీనికి తోడు ముడి చమురు ధరల పెరుగుదల వల్ల సర్కారీ అధిక వ్యయంతో ద్రవ్యోల్బణం, ఆ పై ద్రవ్యలోటు పెరుగుదలకు దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తత్ఫలితంగా ద్రవ్య నియంత్రణకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక అమలు మరింత జాప్యం అవుతుందని హెచ్చరించారు.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించాలని అయిదుగురు సభ్యులు సానుకూలంగా ఓటు వేయగా.. ఒకరు మాత్రం పావు శాతం పెంచాలని కోరారు. రెపో రేటును 6 శాతం వద్ద. రివర్స్‌ రెపో రేటును 5.75 శాతం వద్ద కొనసాగించింది.

తన ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో తటస్థ వైఖరిని కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆఖరి సమీక్ష కావడం గమనార్హం. ఏప్రిల్ 4, 5 తేదీల్లో ద్రవ్య పరపతి విధానంపై తదుపరి ఆర్బీఐ సమావేశం కానున్నది.

 ద్రవ్యలోటు పెరిగేందుకు రిస్క్ ఇలా

ద్రవ్యలోటు పెరిగేందుకు రిస్క్ ఇలా

కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను, డివిడెండ్‌ పంపిణీ పన్ను, రూ.10 లక్షల పైబడిన డివిడెండ్‌ ఆదాయంపై పన్ను, సెక్యూరిటీ లావాదేవీల పన్ను, పెట్టుబడిపైలాభాల పన్ను అనే పేర్లతో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులపై అయిదు పన్నులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. ఇవన్నీ కచ్చితంగా పెట్టుబడులు, పొదుపు నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. సామర్థ్య వినియోగ స్థాయి పెంచుకుని, రుణ పంపిణీని రెండంకెలకు చేర్చడం ద్వారా పెట్టుబడులు - జీడీపీ నిష్పత్తిని మెరుగుదలకు పలు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ద్రవ్య స్థిరీకరణ ప్రణాళిక ఆలస్యం కావొచ్చని.. ద్రవ్యోల్బణ లక్ష్యాలను చేరడం కూడా సవాలుగానే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌అన్నారు. ప్రభుత్వ అధిక వ్యయాలతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. అదే సమయంలో ద్రవ్యలోటు మరింత పెరిగితే సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.

వ్యయంపై నిర్దిష్ఠ గణాంకాలతోనే మరింత స్పష్టత

వ్యయంపై నిర్దిష్ఠ గణాంకాలతోనే మరింత స్పష్టత

డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠ స్థాయి 5.21 శాతానికి చేరింది. బడ్జెట్‌ 2018-19లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కూడా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా బడ్జెట్‌లో గ్రామీణ రంగానికి, ఆయుష్మాన్‌ భారత్‌లకు అధిక కేటాయింపుల కారణంగా ద్రవ్యలోటు పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘ఇంకా వ్యయాలపై నిర్దిష్ట గణాంకాల కోసం వేచి చూస్తున్నామని.. అందుకే కొంత ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నా ఇపుడే ఎంత అని చెప్పలేం' అని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2017-18 నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది.

 అంతర్జాతీయంగా పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం ఇలా

అంతర్జాతీయంగా పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం ఇలా

కీలక రుణ రేటు(రెపో)లో ఎటువంటి మార్పు లేకుండా ఆరుశాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే రివర్స్‌ రెపో రేటు (5.75%), మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ(ఎమ్‌ఎస్‌ఎఫ్‌), బ్యాంక్‌ రేటు(6.25 శాతం)లు కూడా యథాతథంగా కొనసాగుతాయి. ఇక పరపతి విధాన ధోరణి తటస్థంగా ఉంటుంది. గత నెలలో పెట్రోలు, డీజిల్‌ ధరలు జనవరిలో ఎక్కువగా పెరిగాయని, అంతక్రితం పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావం ఇపుడు ప్రతిబింబించిందని ఆర్బీఐ పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదు కావొచ్చు. ఇక 2018-19 ప్రథమార్థంలో ద్రవ్యోల్బణం 5.1-5.6 శాతానికి, ద్వితీయార్థంలో 4.5 - 4.6 శాతానికి పరిమితం కావొచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. 2017-18లో స్థూల విలువ జోడించిన (జీవీఏ) వృద్ధి 6.6 శాతానికి చేరొచ్చునని, ఆ తర్వాతి ఏడాది అది 7.2 శాతానికి పెరగవచ్చునని ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ స్థిరీకరణతో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనున్నదని ఆర్బీఐ పేర్కొన్నది. పెట్టుబడులు పుంజుకుంటున్న సంకేతాలు ముందుగానే కనిపిస్తున్నాయని, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లకు మూలధన పునర్నిర్మాణ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో రుణ వృద్ధి పుంజుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ గిరాకీ మెరుగవుతున్నందున ఎగుమతులు కూడా రాణించవచ్చునని, గ్రామీణ, మౌలిక రంగాలపై బడ్జెట్‌ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆర్బీఐ వ్యాఖ్యానించింది.

 ఎన్‌బీఎఫ్‌సీలపై ఫిర్యాదుకు అంబుడ్స్‌మన్‌

ఎన్‌బీఎఫ్‌సీలపై ఫిర్యాదుకు అంబుడ్స్‌మన్‌

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రభావాలు తగ్గుతున్న నేపథ్యంలో వృద్ధి పరంగా కొంత మెరుగుదల కనిపిస్తోందని ఆర్బీఐ తెలిపింది. 2018-19లో భారత్‌ 7-7.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రం వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించింది. అంతక్రితం గత డిసెంబర్‌లో జరిగిన సమీక్షలో ఈ అంచనాను 6.7 శాతంగా పేర్కొంది. గతేడాది ఫిబ్రవరి నుంచి సర్దుబాటు ధోరణిలో ఉన్న ఆర్బీఐ ఇపుడు తాజా తటస్థ వైఖరికి మారినట్లు ప్రకటించుకుంది. ఆర్‌బీఐ చివరి సారిగా ఆగస్టు 2017న జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపో రేటులో (పావు శాతం) తగ్గించింది. ఇక బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లపై వినియోగదార్లు చేస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెలాఖరుకల్లా నిబంధనలను తీసుకురానున్నట్లు తెలిపింది. దశల వారీగా అమలు చేయనున్న ఈ వ్యవస్థను తొలుత డిపాజిట్లు స్వీకరించే ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తింపజేయనున్నది. వీటి ఆస్తుల పరిమాణం రూ.100 కోట్లు, ఆ పైన ఉండాలి. ‘ప్రసుత్తం బ్యాంకుల కోసం ఉన్న ఈ వ్యవస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఉచితమే కాక.. వేగవంతమైనది కూడా'నని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి. కునుంగో పేర్కొన్నారు. ‘బ్యాంకింగేతర కంపెనీల కోసం ఇలాంటి పథకం లేదు. ఈ నెలాఖరుకల్లా వీటికీ ఆ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తాం' అని ఆయన తెలిపారు.

 ఆగస్టులోగా జీఎస్టీలో చేరిన ‘ఎంఎస్ఎంఈ'ల రుణ చెల్లింపులపై ఇలా మినహాయింపు

ఆగస్టులోగా జీఎస్టీలో చేరిన ‘ఎంఎస్ఎంఈ'ల రుణ చెల్లింపులపై ఇలా మినహాయింపు

చిన్న పరిశ్రమలకు బాసటగా నిలిచేందుకు ఆర్బీఐ కొన్ని చర్యలు ప్రకటించింది. ఇందుకు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష వేదికైంది. జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రభావానికి లోనైన సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు ఊరట కల్పించింది. బ్యాంకులకు ఇవి చెల్లించాల్సిన బకాయిలను తీర్చడానికి అదనంగా 180 రోజుల సమయాన్ని ఇచ్చింది. ‘వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) కింద వ్యాపారాల నమోదు కావడంతోచిన్న కంపెనీలకు నగదు ప్రవాహంపై ప్రభావం పడింది. దీంతో అవి బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు బకాయిలను చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి' అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌.ఎస్‌. విశ్వనాథన్‌ పేర్కొన్నారు. ఆ రుణాలను ఎన్‌పిఏలుగా మారేందుకు అవకాశం ఉన్నవిగా వర్గీకరించకుండానే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు. అలాగే సేవల రంగంలోకి వచ్చే ఎంఎస్‌ఎంఇలకు రుణపరిమితులు కూడా ఎత్తివేసింది. జనవరి 31, 2018 నాటికి వాటి బకాయిలు రూ.25 కోట్లు మించి ఉండరాదు. 2017 సెప్టెంబర్ నుంచి 2018 జనవరి మధ్య ఉన్న బకాయిలను 180 రోజుల కంటే ఎక్కువ కాకుండా ఉన్న సమయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు స్వీకరించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ప్రాధాన్య రంగం కింద సేవల రంగంలోని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు రుణ పరిమితులను సైతం ఎత్తివేసింది. ‘ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రస్తుతం ఉన్న రూ.5 కోట్లు, రూ.10 కోట్ల రుణ పరిమితులను తొలగిస్తున్నాం. దీని ప్రకారం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఉన్న అన్ని బ్యాంకు రుణాలకు ప్రాధాన్య రంగం కింద ఎటువంటి పరిమితులు లేకుండా రుణం స్వీకరించడానికి అర్హతను ఇస్తున్నాం' అని ఆర్‌బీఐ పేర్కొంది. బడ్జెట్లోనూ చిన్న కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పెద్ద పీటే వేశారు. రూ.250 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.

 మంచి అవకాశం జార విడుచుకున్నదన్న ఫిక్కీ

మంచి అవకాశం జార విడుచుకున్నదన్న ఫిక్కీ

పారిశ్రామిక రంగ ప్రముఖులు, సంఘాల ప్రతినిధులు ఆర్‌బిఐ ద్రవ్య పరపతి సమీక్ష ఊహించినట్లే ఉన్నదని అభిప్రాయ పడ్డారు. ద్రవ్యోల్బణ భయాలు, ద్రవ్యలోటు విస్తరించే అవకాశం ఉన్నందున వడ్డీరేట్ల విషయంలో ఆర్‌బిఐ యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించడం సరైన ఆలోచనే అని కొందరు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం రేట్లు తగ్గిస్తే ప్రైవేట్‌ పెట్టుబడుల జోరు పెరిగేదని పేర్కొన్నారు. ఫిక్కీ అధ్యక్షుడు రాషేశ్ షా స్పందిస్తూ గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఒకే ఒకసారి అది కూడా 0.25 శాతం మేర రెపో రేటు తగ్గించిందని, ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వేలో 2017-18లో సగటు ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలో ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించడానికి అందివచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదులుకుందనడంలో సందేహం లేదన్నారు. రేట్లు తగ్గిస్తే ప్రైవేట్‌ పెట్టుబడుల జోరు పెరిగి ఆర్థిక రంగం రాణించేదని రాషేష్ షా వ్యాఖ్యానించారు. దేశంలో ద్రవ్యోల్బణ భయాలు ప్రధానంగా వ్యవసాయోత్పత్తుల సరఫరాలో తేడాలతో తలెత్తుతున్నవేనని, మున్ముందు ఆర్‌బిఐ ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆందోళనలను కూడా పట్టించుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.

 ఆర్బీఐ పాలసీపై అసోచాం ఇలా

ఆర్బీఐ పాలసీపై అసోచాం ఇలా

ఒక రకంగా చెప్పాలంటే ఆర్‌బిఐ నిర్ణయం పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ఊరట అని అసోచాం అధ్యక్షుడు సందీప్ జజోడియా అన్నారు. కొందరు ఎనలిస్టులు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేశారని ఆయన గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ ముడి చమురు ధరల వంటి కొన్ని విషయాల్లో ఆర్‌బిఐ వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకమైనవేనని సందీప్ జజోడియా తెలిపారు. అయితే రైతులకు కనీస మద్ధతు ధర పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అనిల్ ఖైతాన్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, విత్తలోటు టార్గెట్‌ ప్రకారం ఉండకపోవచ్చన్న భయాల వల్ల ఈ సారి ద్రవ్య విధానం కఠినంగా ఉండొచ్చన్న భయాలు తలెత్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ రేట్లను మార్చకుండా అలాగే ఉంచడం అభినందించదగిన విషయం అని పేర్కొన్నారు. సప్లయ్‌లను పెంచేందుకు చేపడుతున్న చర్యల వల్ల ధరల అదుపులోకి వస్తే ఆర్‌బిఐ రేట్లను తగ్గించే విషయం పరిశీలించవచ్చునని పిహెచ్‌డి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ ఖైతాన్‌ చెప్పారు.

English summary
The Reserve Bank of India (RBI) on Wednesday held the policy repo rate at 6% as the central bank’s Monetary Policy Committee (MPC) raised the estimate for fourth-quarter inflation and flagged concerns about the future outlook for price gains. Five of the six members of the RBI’s MPC voted in favour of keeping the benchmark interest rate unchanged for the third consecutive meeting, while one member, M.D. Patra, recommended a 25 basis points (bps) rate increase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X