ఇప్పుడు కాదంటే ఎప్పుడూ కాదు, ఇక అద్భుతాలే, అన్ని మారుస్తా: రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళ ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేనని, అది తనకు సంతోషాన్ని ఇస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. జనవరిలో తన పార్టీ ప్రకటిస్తానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

ప్రజలు, అభిమానుల కోసమే..
తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా రజినీ గుర్తు చేశారు. వైద్యులు వద్దంటున్నా.. ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ అరంగేట్రం కోసం రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా.. కరోనా వల్ల అది సాధ్యపడలేదని వివరించారు.

ఇప్పుడు కాదంటే.. ఎప్పుడూ జరగదు..
తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీకాంత్ అభిమానులకు పిలుపునిచ్చారు. తాను ఇచ్చిన హామీలపై ఎప్పుడూ వెనక్కి వెళ్లేదని లేదని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదని స్పష్టం చేశారు.

విజయం మనదే.. ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది
ప్రజలు తన వెంట నడిస్తే మనమంతా కలిసి మార్పును తీసుకొద్దామని రజనీ వ్యాఖ్యానించారు. ప్రజల ఆదరణతో కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయమని రజనీకాంత్ స్పష్టం చేశారు.

అద్భుతాలు జరుగుతాయి.. అన్నింటినీ మారుస్తా..
అద్భుతాలు జరుగుతాయని, అన్నింటినీ మారుస్తామని రజినీకాంత్ స్పష్టం చేశారు.
రజనీ రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘంగా ఎదురుచూపులు కొనసాగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తాను 2021, జనవరిలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని రజనీ తెలిపారు. ఇప్పటికే ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. రజనీ రాకతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.