కాంగ్రెస్ కు షాక్ ... బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఖుష్బూ.. రానున్న ఎన్నికలే టార్గెట్
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేత, నటి ఖుష్బూ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఖుష్బూ సుందర్ ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్న ఖుష్బూ ఇక నుండి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.
ఖుష్బు సుందర్ బిజెపి ప్రధాన కార్యదర్శి సిటి రవి, బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పత్రా మరియు బీజేపీ పార్టీ ఇతర ముఖ్య నేతల సమక్షంలో బిజెపిలో చేరారు.

బీజేపీలో చేరిన ఖుష్బూ .. కాంగ్రెస్ కు రాజీనామా
నీనటి ఖుష్బూ సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తొలుత డిఎంకెలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కీలకంగానే వ్యవహరించారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన గంటలోపే ఆమె బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు .
పార్టీ వైఫల్యాలపై సోనియా గాంధీకి లేఖ రాసిన ఖుష్బూ
క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియకుండా అని కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు ఆదేశాలు ఇస్తున్నారని, అది నచ్చకనే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గా ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన ఖుష్బూ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపారు.
కాంగ్రెస్ పార్టీలో అణచివేతను గురించి ఆమె తన లేఖలో పేర్కొన్నారు . తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న సమయంలో ఖుష్బూ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి షాక్ కాగా బీజేపీకి బలంగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో తమిళనాడు నుండి పోటీ చేసే అవకాశం
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి ఖుష్బూ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖుష్బూ బీజేపీలో చేరడంతో తమిళనాడు బిజెపికి సినీ గ్లామర్ కూడా వచ్చినట్లయింది.ఖుష్బూ రాక తమకు కలిసొస్తుందని తమిళనాడు బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆమెను స్వాగతిస్తున్నాయి . తాజాగా నేడు ఖుష్బూ బిజెపిలో చేరడంతో పదేళ్ల కాలంలో ఇప్పటివరకు ఆమె మూడు పార్టీలను మారినట్లుగా తెలుస్తుంది.
దేశాన్ని సరైన దిశలో నడిపించటానికి మోడీ నాయకత్వం అవసరం అన్న ఖుష్బూ
దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి పిఎం నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అవసరమని కాలక్రమేణా తాను గ్రహించానని ఖుష్బూ అన్నారు. తాను కాంగ్రెసులో ఉన్న సమయంలో బిజెపి విధానాలను ఎటువంటి కారణం లేకుండా వ్యతిరేకించటంపై బాధపడ్డానని ఖుష్బు సుందర్ అన్నారు.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖుష్బు సుందర్ బిజెపిలో చేరారు. పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు.