నివర్ తీరం దాటింది.. కానీ: చిత్తు కాగితాల్లా: భీతావహంగా తుఫాన్ అనంతరం పరిస్థితులు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ నివార్.. తీరం దాటింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో ఈ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడింది. వాయుగుండంగా మారింది. తీరాన్ని దాటిన అనంతరం తన దిశను స్వల్పంగా మార్చుకుంది. వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడింది. ఏపీ సహా తమిళనాడు, పుదుచ్చేరి అధికార యంత్రాంగాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ తుఫాన్.. అనంతరం పరిస్థితులు భయానకంగా తయారయ్యాయి. అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులకు హోర్డింగులు చిత్తు కాగితాల్లా ఎగిరిపోయాయి.
It’s 3 AM. So far matters under control. 🙏🙏😇😇 pic.twitter.com/SX0VZhoALV
— Kiran Bedi (@thekiranbedi) November 25, 2020
మూడు గంటల పాటు
రాత్రి 11:30 గంటలకు తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ఆరంభమైంది. తుఫాన్ సెంటర్ పాయింట్: 2:30 గంటలకు పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకింది. ఆ సమయంలో 145 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. హోరుమనే శబ్దం భయభ్రాంతులకు గురి చేసింది. చెన్నై, పుదుచ్చేరి సహా తీర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. వీధులు జలమయం అయ్యాయి. చెరువులను తలపించాయి. తుఫాన్ సమయంలో వీచిన బలమైన ఈదురుగాలుల వల్ల వటవృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగా- అనేక చెన్నై సహా తీర ప్రాంత జిల్లాలు అంధకారం అలముకుంది.
కడలూర్లో రికార్డు స్థాయి వర్షం..
తుఫాన్ ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. పుదుచ్చేరికి సమీపంలో ఉన్న కడలూర్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 244 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరి-225, చెన్నై-89, కరైకల్-85, నాగపట్టిణం-63 మిల్లీమీటర్ల వర్షపాత నమోదైంది. కడలూర్లో ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అరియలూర్, కడలూర్, కాంచీపురం, కాళ్లకురిచ్చి, తిరువణ్నామలై, విల్లుపురం, రాణిపేట్లల్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి.
చెన్నై సెంట్రల్లో కుప్పకూలిన మెట్రో స్ట్రక్చర్
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు చెన్నైలో బీభత్సాన్ని సృష్టించాయి. లోతట్టు ప్రాంతాల్లో నడుములోతుకు పైగా వర్షపు నీళ్లు నిలిచాయి. చెన్నై సెంట్రల్ సమీపంలో మెట్రో స్ట్రక్చర్ కుప్పకూలిపోయింది. చెన్నై సెంట్రల్ సమీపంలో మెట్రో స్టేషన్ నిర్మాణం భూమిని తొలిచే పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు అది కుప్పకూలింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే మెట్రో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
జోరుగా సహాయక చర్యలు..
తుఫాన్ అనంతరం ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనడానికి తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. నేలకొరిగిన చెట్లను తొలగించే పనిలో పడ్డాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ముందు జాగ్రత్త చర్యగా వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను దింపారు. వారంతా ఇప్పుడు సహాయక, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
STAY SAFE AT HOME GUYS THE CYCLONE IS INTENSIFYING TAKE NECESSARY PRECAUTIONS AND BR SAFE!♥️ #Nivarpuyal pic.twitter.com/wh2OV6U52u
— SK (@SK10818941) November 25, 2020