పొలిటికల్ డైలమాకు చెక్: ఎట్టకేలకు..తలైవా వచ్చేస్తున్నాడు: రజినీ ఎంట్రీ: ముహూర్తం ఫిక్స్
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. దీనికి అవసరమైన ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఇన్నేళ్లుగా ఊగిసలాట ధోరణిని కనపరిచిన దక్షిణాది సూపర్ స్టార్.. దానికి చెక్ పెట్టారు. రాజకీయాల్లోకి రానున్నట్లు వెల్లడించారు. చెన్నైలో పార్టీ నాయకులు, జిల్లా కార్యదర్శులు, అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మూడోరోజే రజినీకాంత్ తన నిర్ణయాన్ని బహిర్గతం చేశారు.

31న అధికారిక ప్రకటన..
ఈ నెల 31వ తేదీన రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా ఓ ప్రకటన చేయబోతున్నట్లు రజినీకాంత్ వెల్లడించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనితో ఇన్నాళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై కమ్ముకున్న అనుమానపు మేఘాలు తేలిపోయినట్టయింది. డిసెంబర్ 31వ తేదీ కోసం అభిమానులు ఎదురు చూపులు చూస్తున్నారు. రజినీకాంత్ చేసిన ట్వీట్.. ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపింది.

అమిత్ షా పర్యటన అనంతరం
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే రెండు రోజుల పాటు చెన్నైలో మకాం వేశారు. ఆ తరువాతే తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు ఆరంభం అయ్యాయి. అమిత్ షా ఢిల్లీకి తిరుగముఖం పట్టిన వారం రోజుల్లో రజినీకాంత్‌లో రాజకీయ రంగ ప్రవేశంపై చెప్పుకోదగ్గ పరిణామాలు కనిపించాయి. తనకు అచ్చివచ్చిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో పార్టీ నేతలతో భేటీ కావడం, ఆ వెంటనే రాజకీయంపై ప్రకటన చేయడానికి డిసెంబర్ 31వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకోవడం చకచకా సాగిపోయాయి.

పార్టీ స్థాపించినా..
రజినీకాంత్.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్త చాన్నాళ్ల నుంచీ చక్కర్లు కొడుతోంది. రజినీ మక్కళ్ మండ్రం పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దాన్ని రిజిస్టర్ చేయించారు. అయినప్పటికీ.. అనుకున్నంత వేగంగా ఆయన అడుగులు రాజకీయాల వైపు పడలేకపోయాయి. పలు దఫాలుగా ఆయన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. తన అభిమాన సంఘాల ప్రతినిధుల నుంచీ అభిప్రాయాలను సేకరించారు. రాజకీయ పార్టీని ప్రకటించారు గానీ.. దాన్ని క్రియాశీలకంగా మార్చలేకపోయారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. సినిమాల పైనే దృష్టి సారించారు.

తాజా ప్రకటనతో అభిమానుల్లో ఆనందం..
తాజాగా- తన రాజకీయ రంగ ప్రవేశంపై రజినీకాంత్ స్పష్టత ఇవ్వడంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అప్పుడే సంబరాలను మొదలు పెట్టేశారు కూడా. తమ ఆశయాలు, అకాంక్షలకు అనుగుణంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఉంటుందని ఆశిస్తున్నారు. పార్టీ కార్యాలయం, రాఘవేంద్ర కల్యాణ మండపం వద్ద బాణాసంచాను కాల్చుతూ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. తమ తలైవాను ముఖ్యమంత్రిగా చూసుకుంటామని ఉద్వేగంతో చెబుతున్నారు.