రాజకీయాలు వద్దంటున్న రజనీకాంత్ కూతుళ్ళు ..తలైవా అనారోగ్య కారణాలు ..పార్టీ ప్రకటనపై సందిగ్ధం
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటు విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన రజనీకాంత్ ఈనెల 31వ తేదీన పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ పార్టీ ప్రకటన చేస్తానని చెప్పిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ పరిణామాలతో రజనీకాంత్ పార్టీ ప్రకటన చేస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.
పార్టీ ప్రకటనకు ముందే అనారోగ్యానికి గురైన రజనీకాంత్
రజనీకాంత్ చేస్తున్న అన్నాత్తే సినిమా పూర్తిచేయాలని, ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించాలని భావించిన రజనీకాంత్ కు కరోనా వైరస్ ఊహించని షాక్ ఇచ్చింది . హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కొనసాగుతుండగా చిత్ర యూనిట్ లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సినిమా మధ్యలో ఆగిపోయింది. దీంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న రజనీకాంత్ అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. బిపి లో హెచ్చుతగ్గులు ఉన్నకారణంగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత చెన్నై చేరుకున్నారు.

రాజకీయాలు మనకు వద్దు నాన్నా అని తండ్రిని కోరిన రజనీకాంత్ కూతుళ్ళు
దీంతో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయన మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమని రజనీకాంత్ కూతుళ్ళు ఐశ్వర్య , సౌందర్యలు రాజకీయాలు మనకు వద్దు నాన్నా అంటూ తండ్రి దగ్గర వాపోయారు అని సమాచారం.
రజనీకాంత్ ఆరోగ్యం దృష్ట్యా ఇద్దరు కూతుళ్లు తండ్రిని రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స, విపరీతంగా పెరిగిన బీపీ, వృద్ధాప్య కారణాల రీత్యా వారం రోజుల పాటు రజనీకాంత్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అని సూచించారు. ఆయనకు ఒత్తిడి ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు.

శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఇప్పుడు పనికిరాదని రజనీకాంత్ కు డాక్టర్ల సలహా
శారీరక శ్రమకు, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులు చేయకూడదని, అదేసమయంలో కరోనా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించినట్లుగా సమాచారం. దీంతో రజనీకాంత్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ప్రస్తుతం చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రజనీకాంత్ కుమార్తెలు రాజకీయాలు వద్దని కోరడం, రజనీకాంత్ ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితుల కారణంగా పార్టీ ప్రకటన విషయంలో సందిగ్ధం నెలకొంది.

పార్టీ ప్రకటన విషయంలో సందిగ్ధం .. పార్టీ ప్రకటన కన్ఫార్మ్ అంటున్న మక్కల్ మండ్రం నిర్వాహకులు
అయితే రజనీకాంత్ మక్కల్ మండ్రం నిర్వాహకులు మాత్రం పార్టీ ప్రకటన ఖాయమనే ధీమాలో ఉన్నారు. పార్టీతో పాటు మరిన్ని ప్రకటనలు కూడా రజనీకాంత్ చేస్తారంటూ పార్టీ సహ పర్యవేక్షకుడు తమిళరవి మణియన్ అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో రజనీకాంత్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ ప్రకటన వస్తుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సందిగ్ధమే .