• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ ఇద్దరు నేతలు మోదీ టార్చర్ వల్లే చనిపోయారు... డీఎంకె నేత ఉదయ నిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు...

|

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీఎంకె అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. మోదీ టార్చర్,ఒత్తిడి తట్టుకోలేకనే కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్,అరుణ్ జైట్లీ చనిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు లాంటి సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగానే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించారని ఆరోపించారు. గురువారం(ఏప్రిల్ 1) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు...

ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు...

'సుష్మా స్వరాజ్ అనే ఒక నాయకురాలు ఉండేవారు. మోదీ పెట్టిన ఒత్తిడి కారణంగానే ఆమె చనిపోయారు. అరుణ్ జైట్లీ అనే ఓ నాయకుడు ఉండేవాడు. మోదీ టార్చర్ తట్టుకోలేకనే ఆయన కూడా చనిపోయారు.అలాగే సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడిని ఉద్దేశపూర్వకంగానే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించారు. మోదీ... వాళ్లందరినీ మీరు పక్కకు తప్పించి ఉండవచ్చు. కానీ మీకు భయపడేందుకు నేనేమీ సీఎం పళనిస్వామిని కాదు.. ఉదయ నిధి స్టాలిన్‌ను... కలైజ్ఞర్ మనవడిని...' అని ఉదయని నిధి స్టాలిన్ పేర్కొన్నారు.

సుష్మా కుమార్తె కౌంటర్...

ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఉదయనిధి స్టాలిన్ గారు... మీ ఎన్నికల ప్రచారంలోకి మా అమ్మను లాగకండి. మీవి తప్పుడు ఆరోపణలు. ప్రధాని నరేంద్ర మోదీ నా తల్లికి ఎంతో గౌరవమిచ్చారు. మేము కష్ట కాలంలో ఉన్న సమయంలో ప్రధానితో పాటు బీజేపీ మాకు అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధపెట్టేలా ఉన్నాయి.' అని బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. ప్రధానిని టార్గెట్ చేసేందుకు తన తల్లిని,అరుణ్ జైట్లీని అగౌరవపరిచేలా మాట్లాడటం అత్యంత నీచమైన చర్య అని మండిపడ్డారు.

జైట్లీ కుమార్తె ఫైర్...

ఉదయ నిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నాకు తెలుసు మీపై ఎన్నికల ఒత్తిడి ఉందని... కానీ అందుకోసం మీరు మా తండ్రిని అగౌరవపరిచేలా అబద్దాలు మాట్లాడితే మౌనంగా ఉండలేం. రాజకీయాలను మించి మోదీకి,జైట్లీకి మధ్య మంచి అనుబంధం ఉంది. అలాంటి స్నేహం గురించి తెలుసుకునే అదృష్టం మీకు కూడా కలగాలని ప్రార్థిస్తున్నాను...' అంటూ సోనాలి జైట్లీ ఉదయ నిధికి కౌంటర్ ఇచ్చారు. కాగా,2016లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న సుష్మా స్వరాజ్... అనారోగ్య కారణాలతో అగస్టు 6,2019న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతోనే జైట్లీ కూడా అగస్టు 24,2019న కన్నుమూశారు.

చెపాక్ నుంచి ఉదయ నిధి స్టాలిన్...

చెపాక్ నుంచి ఉదయ నిధి స్టాలిన్...

ఉదయని నిధి స్టాలిన్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దిగ్గజ ద్రవిడ నేత,తన తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉన్నారు. డీఎంకెకు కంచుకోట లాంటి ఈ స్థానం నుంచి గతంలో 1996,2001,2006లో కరుణానిధి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ గెలిచిన రెండుసార్లు కరుణానిధి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2011,2016 ఎన్నికల్లోనూ ఇక్కడ డీఎంకేనే విజయం సాధించింది. ప్రస్తుతం డీఎంకె తరుపున ఉదయ నిధి స్టాలిన్,ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పీఎంకె నేత కసాలి ఇక్కడినుంచి పోటీ చేస్తున్నారు. కాగా,ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడవుతాయి.

English summary
Udhayanidhi Stalin, son of Dravida Munnetra Kazhagam (DMK) chief MK Stalin, courted a controversy on Thursday with his comments alleging that former Union ministers Sushma Swaraj and Arun Jaitley died due to "torture" and "pressure" exerted by Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X