ttd tamil nadu ys jagan yv subba reddy ఎడప్పాడి పళనిస్వామి వైఎస్ జగన్ వైవీ సుబ్బారెడ్డి tamil nadu assembly elections 2021
అసెంబ్లీ ఎన్నికల వేళ..తమిళనాడులో వైఎస్ జగన్ భారీ కటౌట్: సీఎం పళనిస్వామి సహా
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. అధికార ఏఐఏడీఎంకే.. ఈ సారి భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతోంది. డీఎంకే ఎప్పట్లాగే మిత్రపక్షం కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోనుంది. మరోవంక- లోక నాయకుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీథి మయ్యం.. మజ్లిస్‌తో పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. త్వరలో ఈ రెండు పార్టీల నేతల మధ్య కీలక భేటీ ఏర్పాటు కానుంది. ప్రధాన పోటీ మాత్రం ఏఐఏడీఎంకే-డీఎంకేల మధ్యే ఉండబోతోంది.
ఈ పరిణామాల మధ్య ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓ భారీ కటౌట్.. తమిళనాడు వెలిసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, వైఎస్ జగన్‌తో కూడిన ఆ కటౌట్.. కాళ్లకురిచ్చి జిల్లా ఉలందరూర్ పేటలో ఏర్పాటైంది. ఉలందుర్ పేటకు చెందిన ఏఐఏడీఎంకే శాసనసభ్యుడు కుమారగురు ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఉలందుర్ పేటలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించ దలిచిన శ్రీవారి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా దాన్ని నెలకొల్పారు.

కుమారగురు.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు. తన నియోజకవర్గంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి ఆయన 3.98 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఎడప్పాడి పళనిస్వామి కొద్దిసేపటి కిందటే భూమిపూజ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుమారగురు సతీసమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితుల వేదమంత్రాల మధ్య వైభవంగా భూమిపూజ చేశారు. ఈ స్థలంలో వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి ఉప ఆలయాలు కూడా నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా పళనిస్వామితో పాటు వైఎస్ జగన్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమౌతోంది. ఉలుందూర్ పేట.. ఏపీ సరిహద్దులకు ఆనుకుని కూడా లేదు. చిదంబరం సమీపంలో ఉందా టౌన్. పెద్దగా తెలుగు ఓటర్లు కూడా అక్కడ నివసించే అవకాశం తక్కువే. అయినప్పటికీ.. పళనిస్వామితో సమానంగా వైఎస్ జగన్ కటౌట్‌ను ఏఐఏడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుమారగురు టీటీడీ బోర్డు సభ్యుడు కావడం వల్లే వైఎస్ జగన్ కటౌట్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం ఉంది.