తమిళ రాజకీయాల్లో అనూహ్యం: చీలిక దిశగా ఏఐఏడీఎంకే: పన్నీర్‌సెల్వం కొత్త కుంపటి
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే చీలికదిశగా సాగుతోంది. పార్టీలో ద్వినాయకత్వాన్ని కొనసాగించడంపై ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం కాస్తా రసాభాసగా ముగిసిన అనంతరం- ఇక చీలిక తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ద్వినాయకత్వాన్ని మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తోన్నారు. ప్రత్యేకించి- పన్నీర్ సెల్వం లీడర్షిప్ను ఏ మాత్రం అంగీకరించట్లేదు.

అనేక అంశాల్లో
తమిళనాడు అసెంబ్లీలో ఏఐఏడీఎంకేకు ఉన్న సంఖ్యాబలం..66. అయిదు మంది ఎంపీలు కూడా ఉన్న ఈ పార్టీ దాదాపు పతనం అంచుల్లో నిలిచిందనే అభిప్రాయాలు ఉన్నాయి. జులై 18వ తేదీన జరగబోయే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించాలనే విషయం మీద పార్టీ నాయకుల్లో ఏర్పడిన భేదాభిప్రాయాలు పతాక స్థాయికి చేరాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మిత్రపక్షంగా కొనసాగుతున్నందున.. ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంది.

వాటర్ బాటిళ్లు విసిరిన నేతలు..
దీనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను భర్తీ చేసేలా తీర్మానం చేయాలనే విషయం మీద మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు తలెత్తాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. చెన్నైలో గురువారం సాయంత్రం నిర్వహించిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీర్ సెల్వంపై వాటర్ బాటిళ్లు విసిరేంతగా. పన్నీర్ సెల్వం మాట్లాడుతున్న సమయంలో పలువురు జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆయనపై వాటర్ వాటిళ్లను విసిరేశారు.

పన్నీర్ సెల్వంపైనే..
ఈ పరిణామం.. ఏఐఏడీఎంకేలో చీలక ఏర్పడిందనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది. పన్నీర్ సెల్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏఐఏడీఎంకే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామిల పర్యవేక్షణలో కొనసాతోంది. వారిద్దరూ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తోన్నారు. 1972లో పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అనేది ఖాళీగా ఉంటూ వస్తోంది. దీన్ని భర్తీ చేసేలా బైలాస్‌లో మార్పులు చేయాలంటూ జనరల్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. అది కుదరట్లేదు.

బైలాస్‌లో మార్పులు..
పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో కూడిన ద్వినాయకత్వాన్ని స్వస్తి పలికి.. ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను భర్తీ చేసేలా బైలాస్‌లో మార్పులు చేయాలంటూ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించాలని పార్టీ నిర్ణయించగా.. అది బెడిసి కొట్టింది. పళనిస్వామి వర్గం దీన్ని వ్యతిరేకిస్తోందనే ప్రచారం ఉంది. 2,700 మంది సభ్యులతో కూడిన జనరల్ కౌన్సిల్లో 2,500 మంది తమ మద్దతుదారులేనంటూ పన్నీర్ సెల్వం వర్గం చెబుతోన్నప్పటికీ.. తాజా భేటీలో ఆయనపైనే వాటర్ బాటిళ్లు విసరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

11న మరో భేటీ..
మళ్లీ ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం వచ్చేనెల 11వ తేదీన ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అదే నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున.. ఏ కూటమికి మద్దతు ఇవ్వాలనేది అప్పుడే తేల్చేస్తారని అంటున్నారు. తాజా భేటీ రసాభాసగా ముగిసినందున వచ్చే నెలలో నిర్వహించే సమావేశం కీలకంగా మారుతుందని, 23 తీర్మానాలను పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. దీని తరువాత పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.