తమిళనాడు విద్యార్ధి అద్భుతం- ప్రపంచంలోనే తేలికపాటి శాటిలైట్ రూపకల్పన
తమిళనాడుకు చెందిన శస్త్ర యూనివర్శిటీలో చదువుతున్న రియాస్ దీన్ అద్భుతం సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి ఉపగ్రహాన్ని తయారు చేశాడు. తాజాగా నిర్వహించిన క్యూబ్స్ ఇన్ స్పేస్ గ్లోబల్ పోటీల్లో తన అసమాన ఆవిష్కరణతో విజేతగా నిలిచాడు.
దీంతో ఈ తమిళనాడు విద్యార్ధిపై జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

నాసా తాజాగా క్యూబ్స్ ఇన్ స్పేస్ గ్లోబల్ కాంపిటీషన్స్ నిర్వహించింది. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపగ్రహాల కంటే తేలికపాటి శాటిలైట్‌ను రూపకల్పన చేయాలని ఛాలెంజ్ విసిరింది. ఇందులో దేశ, విదేశాలకు చెందిన విద్యార్ధులు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి తమిళనాడులోని శస్త్ర యూనివర్శిటీలో మెకట్రానిక్స్ రెండో సంవత్సరం చదువుతున్న రియాస్దీన్ సత్తా చాటాడు. 73 దేశాలకు చెందిన 1000 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు, నిపుణులు పాల్గొన్న ఈ పోటీల్లో అత్యంత తేలికపాటి ఉపగ్రహాన్ని తయారు చేసి చూపించాడు.

రియాస్దీన్ 37 ఎంఎం పేలోడ్ సామర్ధ్యం కలిగిన రెండు ఎఫ్ఈఎంటీవో శాటిలైట్స్‌కు రూపకల్పన చేశాడు. విజన్ శాట్ వీ1, వీ2గా వీటికి పేర్లు పెట్టారు. ఒక్కొక్కటీ కేవలం 33 గ్రాముల బరువు, 37 ఎంఎం సైజ్ మాత్రమే కలిగి ఉంది. ఇది ప్రపంచ రికార్డుగా కూడా నమోదైంది.
విజయవంతమైన స్టార్టప్‌ను స్థాపించాలనే తన కలను నెరవేర్చడానికి రియాస్దీన్కు రూ .5 లక్షల ఇంక్యుబేషన్ గ్రాంట్‌ను 3 డి ప్రింటింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) లో శస్ట్రా-టిబిఐ అందిస్తుందని వైస్-ఛాన్సలర్ ఎస్ వైద్యసుబ్రమణ్యం తెలిపారు.