అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
తమిళనాడులో ఓ అమానవీయ ఘటన వెలుగుచూసింది. ప్రేమ వివాహం చేసుకున్న దళిత జంటకు గ్రామ పెద్దలు రూ.2.5లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు,వారికి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించారు. తిరుపత్తూర్ పరిధిలోని పుల్లూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకునే జంటలకు జరిమానా విధించడం తమ గ్రామంలో చాలా సాధారణ వ్యవహారంగా మారిపోయిందని... అయితే ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటిసారని ఆ జంట వాపోయింది.

కనగరాజ్-జయప్రియ...
పుల్లూరు గ్రామానికి చెందిన కనగరాజ్(26) దళిత సామాజికవర్గంలోని మురచా పరయార్ కులానికి చెందిన వ్యక్తి. వృత్తి రీత్యా డ్రైవర్. అదే గ్రామానికి చెందిన జయప్రియ(23) దళిత సామాజికవర్గంలోని తమన పరయ కులానికి చెందిన యువతి. కనగరాజ్,జయప్రియ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ఇంట్లో పెద్దలకు చెప్పగా... జయప్రియ కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో పుల్లూరు నుంచి పారిపోయిన ఆ జంట 2018లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి అక్కడే జీవనం సాగిస్తున్నారు.

లాక్‌డౌన్‌తో పరిస్థితులు తలకిందులు...
కరోనా లాక్ డౌన్ ముందు వరకూ వీరి జీవితం సాఫీగానే సాగింది. డ్రైవర్‌గా వచ్చే సంపాదనతో కనగరాజ్ భార్యను బాగానే చూసుకున్నాడు. కానీ ఇంతలో లాక్ డౌన్ కారణంగా పరిస్థితులు తలకిందులయ్యాయి. కనగరాజ్ డ్రైవర్ ఉద్యోగం పోయింది. దీంతో స్వగ్రామం పుల్లూరుకు వెళ్లి అక్కడ ఏదైనా పని చేసుకుని బతకాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే భార్యను తీసుకుని గ్రామంలో అడుగుపెట్టాడు. అయితే గ్రామంలో ఉండాలంటే రూ.2.5లక్షలు జరిమానా కట్టాల్సిందేనని పుల్లూరు గ్రామ పెద్దలు తీర్మానించారు.

గ్రామ పెద్దల జరిమానా...
'కులాంతర వివాహాలు చేసుకునేవారికి జరిమానా విధించడం మా దగ్గర చాలా కామన్. కానీ గతంలో రూ.5వేల నుంచి రూ.10వేలు వరకు మాత్రమే జరిమానా విధించేవారు. కానీ మాకు రూ.2.5లక్షలు జరిమానా విధించారు. అంత డబ్బు నేను చెల్లించలేను... రూ.25వేలు వరకు ఇచ్చుకోగలను అని చెప్పాను. కానీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు అసలు ఇక ఏ జరిమానా కట్టనని చెప్పేశాను. అయినప్పటికీ వాళ్లు నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన ఓ పండుగలో పాల్గొనేందుకు వెళ్తే... నన్ను,నా భార్యను ఆలయంలోకి రానివ్వలేదు.' అని కనగరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

జరిమానా విధించలేదన్న గ్రామ పెద్ద..
గ్రామ పెద్దల తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన కనగరాజ్ ఇక లాభం లేదనుకుని తిమంపెట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజానికి అంతకుముందు పంచాయతీలో జరిమానా చెల్లించనక్కర్లేదని చెప్పిన గ్రామ పెద్దలు... ఇప్పుడు మళ్లీ అందుకోసం వేధిస్తున్నారని పేర్కొన్నాడు. మరోవైపు గ్రామ పెద్ద ఎల్లప్పన్ మాత్రం తాము ఎవరిపై ఎటువంటి జరిమానా విధించలేదని చెప్పాడు. వాళ్ల తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు... వాళ్ల కుటుంబాల మధ్యే తగవులు జరుగుతున్నాయని చెప్పాడు. ఇక్కడున్నవాళ్లంతా పేదలే అని తెలుసు... అలాంటప్పుడు అంత భారీ జరిమానా మేము మాత్రం ఎందుకు విధిస్తామని ప్రశ్నించాడు.

పోటాపోటీ కేసులు...
తమకు ఆలయ ప్రవేశం నిరాకరించడమే కాదు.. అతని మామపై కూడా ఎల్లప్పన్,అతని మనుషులు దాడి చేశారని కనగరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి కౌంటర్‌గా ఎల్లప్పన్ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దానిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఇరువురి కేసులపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో పుల్లూరు సమీపంలోని మరో గ్రామంలోనూ ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు ఇలాగే జరిమానా విధించినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.