91 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు.. వారం లోగా రిప్లై ఇవ్వాలని పోలీసులు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతి కేసులో నోటీసులు ఇచ్చారు. వైసీపీ నేతల వేధించడంతోనే ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చంద్రబాబు నాయుడు డీజీపీకి కూడా లేఖ రాశారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. ఓం ప్రతాప్ మృతికి సంబంధించి ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరారు.

మంత్రిపై ఆరోపణలు
ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. దీంతో పోలీసులు సీఆర్పీసీ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. మృతికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వారంలోగా కార్యాలయానికి హాజరై అందజేయాలని డీఎస్పీ స్పష్టం చేశారు. చంద్రబాబుతోపాటు మాజీమంత్రి నారా లోకేష్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు కూడా చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వైసీపీ కోసం పనిచేశాడని..
ప్రతాప్ అనే దళిత యువకుడు ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేశాడు. అయితే జగన్ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రారంభించాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధంతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పోస్ట్ చేశారు. తర్వాత నుంచి అతనికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేతలు, పోలీసులు వేధించడం ప్రారంభించారు.

ఆత్మహత్య చేసుకోవడంతో
సూటి పోటి మాటలతో ప్రతాప్ విసిగిపోయాడు. చిత్తూరు జిల్లా సోమాల మండలం కందూరులో విగతజీవిగా కనిపించాడు. అతను ఎలా చనిపోయారో అనే అంశంపై స్పష్టత లేదు. అయితే వైసీపీ నేతల వేధింపులతోనే చనిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రతాప్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ హత్య వెనక ఉన్న వైసీపీ నేతలను శిక్షించాలని కోరారు.