టీడీపీ మాజీమంత్రి కన్నుమూత: రెండు పార్టీ నేతల సంతాపం: చంద్రబాబుకు సన్నిహితుడిగా
చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీమంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదివరకు గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఐరాల మండలం కొత్తపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్య కారణంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదివరకు ఎన్టీ రామారావు, అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో పౌర సరఫరాలు, వైద్య, ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు- పలమనేరులో డాక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీలో చేరారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొద్దిరోజుల కిందట గుండెకు ఆపరేషన్ చేసుకున్న అనంతరం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మంత్రిగా పనిచేసినప్పటికీ.. సాధారణ జీవితాన్ని గడిపారు. బైక్‌పైనే ఆయన నియోజకవర్గంలో పర్యటించే వారు. సొంత ఖర్చులతో రాకపోకలను సాగించేవారు. బీజేపీలో చేరినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
2019 ఎన్నికల్లో ఆయన మళ్ళీ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పటికీ.. టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఒడిపోవడంతో ఆయన తిరిగి మళ్ళీ బీజేపీలో చేరారు. పట్నం సుబ్బయ్య మరణం పట్ల మాజీమంత్రి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు పులివర్తి నాని, బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. రెండవ సారి బీజేపీలో చేరిన తరువాత బీజేపీ నాయకత్వం ఆయననను పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.