చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వని కారణాలు ఇవే ... క్లారిటీ ఇచ్చిన చిత్తూరు , తిరుపతి అర్బన్ ఎస్పీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల, అలాగే కోవిడ్ నిబంధనల దృష్ట్యా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో టిడిపి నిర్వహించ తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడు దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంపై స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా అనుమతి ఇవ్వలేదని చెప్పారు .
తన గొంతు నొక్కలేరన్న చంద్రబాబు... రికార్డింగ్ డ్యాన్సులకు కరోనా అడ్డు రాలేదా ? టీడీపీ నేతల ధ్వజం

చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరణపై ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టత
కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని, ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉందని గుర్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు గాంధీ సర్కిల్ జాతీయ రహదారులు అనుసంధానంగా ఉన్నందున, ప్రజలు ఇబ్బందులు పడకుండా అక్కడి నిరసనకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుమతి కోసం కోరినప్పుడు గాంధీ సర్కిల్ లో కాకుండా నగర శివారు ప్రాంతాలలో నిర్వహించుకోవచ్చని సూచించామని, కానీ వారు గాంధీ సర్కిల్ వద్ద నిర్వహిస్తామని చెప్పడంతో అనుమతి నిరాకరించామని ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
టీడీపీ శ్రేణులకు ఎస్ఈసి అనుమతి తీసుకోమని సూచించామని ఎస్పీ పేర్కొన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని తేల్చి చెప్పారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులు , దౌర్జన్యాల గురించి టీడీపీ నేతల నుండి అభ్యర్థుల, నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ పి సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.

ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా టీడీపీ నిరసనకు అనుమతి ఇవ్వలేదన్న తిరుపతి అర్బన్ ఎస్పీ
తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు సైతం ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా టీడీపీ నిరసనకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశామని, అనుమతి నిరాకరించినప్పటికీ నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేశారని ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్పష్టం చేశారు. టిడిపి నిరసన తెలపాలని పెద్ద ప్రాంతం తిరుపతిలో కీలకమైన ప్రాంతం కావడంతో అక్కడ ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా అనుమతి నిరాకరించామని వెల్లడించారు.