ఆన్లైన్ ప్రకటనలతో వ్యభిచార దందా... పేద,అమాయక యువతులకు డబ్బు ఆశజూపి...
చిత్తూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం కలకలం రేపుతోంది. పేద,అమాయక యువతులకు డబ్బు ఆశజూపి వ్యభిచార నిర్వాహకులు వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షించి యువతులను వారి వద్దకు పంపిస్తున్నారు. ఒకవేళ విటులు తమవద్దకే వస్తామంటే... ఎక్కడైనా అపార్టుమెంటుల్లో లేదా లాడ్జీల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఇటీవల తిరుపతిలో పలువురు విటులు,నిర్వాహకులు పట్టుబడటంతో బయటపడింది.

వ్యభిచార దందా...
వ్యభిచార గృహాల నిర్వాహకులు డబ్బు ఆశజూపి నిరుపేద యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. తమిళనాడుకు చెందిన బ్రోకర్లతోనూ వీరికి సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి ఇక్కడికి,ఇక్కడి నుంచి అక్కడికి అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. తిరుపతితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు,లాడ్జీలు,అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.యువతుల ఫోటోలు,వాట్సాప్ నంబర్లతో ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. ఒక గంటకు రూ.1వెయ్యి నుంచి రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఒకరోజుకు రూ.10వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఇలా వెలుగులోకి...
ఎవరైనా వారిని సంప్రదిస్తే... మొదట డబ్బు,ఆ తర్వాతే యువతి అని చెప్తారు. ఆన్లైన్ పేమెంట్ చేశాక వారు చెప్పిన చోటుకు యువతిని పంపిస్తారు. లేదా తాము అద్దెకు తీసుకున్న లాడ్జిలు,అపార్టుమెంటుల్లో అందుకు ఏర్పాట్లు చేస్తారు. కొద్దిరోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులు,నిర్వాహకులు,యువతులను పోలీసులు పట్టుకున్నారు. గత శుక్రవారం ఓ లాడ్జిలో మరో విటుడు పట్టుబడ్డాడు. వారి నుంచి వివరాలు రాబట్టగా.. వ్యభిచార దందా వెనుక ఓ లేడీ కూడా ఉన్నట్లు గుర్తించారు.

నిఘా పెట్టిన పోలీసులు
హైటెక్ వ్యభిచార దందాపై పోలీసులు నిఘా పెట్టారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అసాంఘీక శక్తులను పట్టుకుంటామని అంటున్నారు. లాడ్జిల యజమానులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆన్లైన్ ప్రకటనలపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. తిరుపతిలో వ్యభిచార దందాలను పూర్తిగా నిర్మూలించి ఆధ్యాత్మిక నగర పవిత్రతను కాపాడాలని స్థానికులు కూడా కోరుతున్నారు.