• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శేషాచలం అడవుల్లో కలకలం: జల్లెడ పడుతున్న అటవీ అధికారులు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: శేషాచలం అడవులు.. ఏడుకొండలవాడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం ఉన్న ప్రదేశం. అరుదైన వన్యప్రాణులు, జీవజాతులు, ఔషధ మొక్కలకు నిలయం. దీనితోపాటు- ప్రపంచంలో మరెక్కడా లభించని నాణ్యమైన ఎర్రచందనం లభించేది ఈ అడవుల్లోనే. అందుకే- ఎర్రచందనం స్మగ్లర్లు మాటు వేస్తుంటారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటారు. కోట్ల రూపాయలను ఆర్జిస్తుంటారు. ఈ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు.

విస్తృతంగా కూంబింగ్..

విస్తృతంగా కూంబింగ్..

విలువైన ఎర్రచందనం వృక్షాలను నరికి, వాటిని దుంగలుగా మార్చి, దేశ సరిహద్దులను దాటిస్తుంటారు. దీన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది. ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మావోయిస్టల కోసం ఏ తరహాలో గాలింపు చర్యలను చేపడుతుంటారో.. అదే తరహాలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం శేషాచలం అడవుల్లో క్యూంబింగ్ చేపడుతుంటారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. ఎర్రచందనం వృక్షాలు ఉన్న చోట్ల ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

 నిఘా పెరగడంతో..

నిఘా పెరగడంతో..

ప్రత్యేక క్యాంప్‌లను నిర్వహిస్తోన్నారు. నిఘా ముమ్మరం చేశారు. ఆయా చర్యల వల్ల చాలాకాలం పాటు స్తబ్దుగా కనిపించిన శేషాచలం అడవుల్లో మళ్లీ కలకలం నెలకొన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా నిద్రాణంగా కనిపించిన ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ పంజా విసురుతున్నట్టే కనిపిస్తోంది. దట్టమైన శేషాచలం అడవుల్లో మాటు వేసిన ఎర్రచందనం స్మగ్లర్లు.. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. చెట్లను నరికివేయడానికి తమిళనాడుకు చెందిన కూలీలను వారు వినియోగిస్తుంటారు.

 తలకోన వద్ద రాళ్లు రువ్విన స్మగ్లర్లు..?

తలకోన వద్ద రాళ్లు రువ్విన స్మగ్లర్లు..?

తలకోన సమీపంలోని సెంట్రల్ బీట్ ప్రాంతం వద్ద కూంబింగ్ నిర్వహిస్తోన్న అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్లుగా చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాళ్లు విసిరిన వారి కోసం అటవీశాఖ-టాస్క్‌ఫోర్స్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో- దొర్రికనుమ వద్ద పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 పోలీస్ ఇన్‌ఫార్మర్లు యాక్టివ్..

పోలీస్ ఇన్‌ఫార్మర్లు యాక్టివ్..

దీనివిలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 10 లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని అధికారులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారని అంటున్నారు. స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లను మోహరింపజేసినట్లు తెలుస్తోంది. శేషాచలం అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొత్తవారు ఎవరు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు.

 ఎన్‌కౌంటర్‌తో కలకలం..

ఎన్‌కౌంటర్‌తో కలకలం..


ఇదివరకు చంద్రగిరి మండలం ఈతగుంట వద్ద చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 20 మందికి పైగా తమిళనాడుకు చెందిన కూలీలు మరణించారు. టాస్క్‌ఫోర్స్‌ బృందానికి ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది స్మగ్లర్లు మృతి చెందారు. శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు, ఈతగుంట వంటి ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తరువాత కూడా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేక్ పడలేదు. కొంత విరామం ఇచ్చారు స్మగ్లర్లు.

 విస్తృతంగా గాలింపు..

విస్తృతంగా గాలింపు..

ఇప్పుడు మళ్లీ అక్రమరవాణదారులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. తలకోన సెంట్రల్ బీట్ ప్రాంతంలో అటవీశాఖ-టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయని అంటున్నారు. రాత్రివేళ కూంబింగ్ నిర్వహిస్తున్నారని, చలి తీవ్రత పెరగడంతో గాలింపు చర్యలు ఉండవనే ఉద్దేశంతో స్మగ్లర్లు ఈ కాలంలోనే అక్రమ రవాణాకు పాల్పడుతుంటారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Red sanders smugglers again strike at Seshachalam forests in Chittoor district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X