పవన్ కళ్యాణ్ కు తిరుపతిలో గెలిచే సీన్ లేదు .. చంద్రబాబును ఎవరూ నమ్మరు : రోజా ధ్వజం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చున్నారని ఆరోపించిన రోజా పవన్ కళ్యాణ్ తిరుపతి లో పోటీ చేస్తే గెలిచేంత సీన్ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు అమరావతిలోనే గెలవలేకపోయారన్న రోజా తిరుపతిలో టీడీపీకి స్థానం లేదన్నారు.
స్థానిక ఎన్నికలపై టీడీపీ పగటికలలు..మార్చిలోగా ఎన్నికల డిమాండ్ అందుకే: ఎమ్మెల్యే రోజా ధ్వజం

పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అమ్ముడుపోయి, తిరుపతి సీటు కోసం ఢిల్లీ వెళ్ళారా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రశ్నార్ధకంగా మారిందని ,జనసేన ఉనికే లేదని పేర్కొన్న రోజా ఎవరెన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అసలు జనసేన పార్టీని ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు అని రోజా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అమ్ముడుపోయి, ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీకి వెళ్లారని రోజా విమర్శలు గుప్పించారు. పార్టీ పెట్టినప్పుడే జనసేన పోటీ చేయలేకపోయిందని,అప్పుడు టీడీపీ , బీజేపీ ల కోసం ప్రచారం చేసిందని అన్నారు .

సొంత ఊళ్లోనే గెలవలేదు .. ఇప్పుడు తిరుపతిలో గెలుస్తారా ?
ఇక జిహెచ్ఎంసి ఎన్నికలో పోటీ చేసి వెనకడుగు వేసిందని, తమ వాళ్ళు ఉన్న దగ్గర, సొంత ఊళ్లోనే గెలవలేకపోయారు అని ఎద్దేవా చేసిన రోజా తిరుపతిలో విజయం వైసిపిదేనంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. జనసేన పార్టీ నా లేక కేటీఆర్ చెప్పినట్టు మోడీ భజన సేన పార్టీ నా అనేది నాకు అర్థం కావడం లేదంటూ రోజా జనసేన నుద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలలో పోటీ చెయ్యకుండా విరమించుకుని అందుకు ప్రతిఫలంగా తిరుపతి సీటు కావాలని జనసేన కోరడం మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందని రోజా వ్యాఖ్యానించారు .

అమరావతిలో చంద్రబాబు కొడుకే ఓడిపోయారు... తిరుపతిలో గెలుస్తారా ?
సొంత ఊరిలోనే గెలవలేని పవన్ కళ్యాణ్ తిరుపతి లో గెలిచే సీన్ లేదంటూ అటు టిడిపిని కూడా తూర్పారబట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రోజా.
తిరుపతిలో చంద్రబాబు విజయం సాధించడం అసాధ్యమన్నారు రోజా. అమరావతిని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకున్న చంద్రబాబుకు అమరావతి ప్రజలు ఓట్లు వేయలేదని పేర్కొన్నారు. సాక్షాత్తు అమరావతి వద్ద మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు తనయుడు లోకేష్ ను సైతం ఓడించారని గుర్తు చేశారు .

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయం అన్న రోజా
తిరుపతిలో చంద్రబాబు ఎలా గెలుస్తాడో చెప్పాలని రోజా ప్రశ్నించారు. తిరుపతి ప్రజలు టీడీపీని నమ్మరని అన్నారు. టీడీపీ ఎం చేసినా సరే ఓటమి తప్పదని చెప్పారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లా కోసం ఏమీ చేయలేదని చిత్తూరు ప్రాంత ప్రజలకు ఆ విషయం బాగా తెలుసనీ పేర్కొన్న రోజా తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీదే విజయం అని చెప్పారు .