chandrababu naidu tdp kuppam naravaripalli AP Panchayat elections 2021 nimmagadda ramesh kumar చంద్రబాబు నాయుడు కుప్పం నారావారిపల్లె politics
కుప్పంలో పరాభవమే కానీ, స్వగ్రామంలో సత్తా చాటిన చంద్రబాబు: వైసీపీ ప్రయత్నాలు విఫలం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నాలుగు విడతల్లోనూ హవా చూపించారు. సగానికిపైగా స్థానాలు వారే గెలుచుకున్నారు. అయితే, నాలుగో విడతలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కొంత ఊరట లభించింది. కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలను వైసీపీ మద్దతుదారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ.. ఆయన స్వగ్రామంలో మాత్రం టీడీపీ మద్దతుదారు గెలుపొందారు.

స్వగ్రామంలో సత్తా చాటిన చంద్రబాబు
చంద్రబాబు స్వగ్రామమైన కందులవారిపల్లె పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఘన విజయం సాధించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె.. కందులవారిపల్లె పంచాయతీ పరిధిలో ఉండటం గమనార్హం. ఈ గ్రామంలో 10 వార్డులుండగా, 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అవి రెండు కూడా వైసీపీ మద్దతుదారులే కావడం గమనార్హం. అయితే, మిగిలిన 8 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా.. 8 వార్డుల్లోనూ టీడీపీ మద్దతుదారులే గెలుపొందారు.

వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు
టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన బొబ్బా లక్ష్మి 563 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కందులవారిపల్లె పంచాయతీని కూడా కైవసం చేసుకుని చంద్రబాబుకు షాకివ్వాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేసినా.. ఓటర్లు మాత్రం టీడీపీ మద్దతుదారులనే గెలిపించారు. దీంతో చంద్రబాబు తన స్వగ్రామంలో మరోసారి తన పట్టును నిలుపుకున్నట్లయింది.

చంద్రబాబుపై అభిమానంతో..
కాగా, చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కందులవారిపల్లెలో ఎలాగైనా వైసీపీ మద్దతుదారులను గెలిపించాలని వైసీపీ నేతలు శాయశక్తులా పనిచేసినప్పటికీ.. చంద్రబాబు మీద అభిమానంతో కందులవారిపల్లె ప్రజలు టీడీపీ మద్దతుదారుడినే గెలిపించారు.

కుప్పంలో చంద్రబాబు ఘోర పరాభవమే..
అయితే, చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మాత్రం వైసీపీ మద్దతుదారులదే హవా కొనసాగింది. మొత్తం 89 పంచాయతీలకు గానూ 75 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో వైసీపీ క్వీన్ స్వీప్ చేయడం గమనార్హం. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పంలో వైసీపీ తన హవా చూపగా.. ఇప్పుడు ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రానతిథ్యం వహిస్తున్న హిందూపురంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఫలితాలు వస్తే గానీ తెలియదు.