అన్నంతపని చేసిన అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు .. గణపతి ఆలయంలో సతీ సమేతంగా సత్య ప్రమాణాలు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల రచ్చ ఆలయంలో ప్రమాణాల దాకా వెళ్ళింది. ఈ రోజు ఇద్దరు నేతలు బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ముహూర్తం పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు గణపతి ఆలయంలో స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు.
గణపతి ఆలయంలో ప్రమాణాలకు సిద్ధమైన అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు .. హై టెన్షన్ , 144సెక్షన్ విధింపు

అవినీతి ఆరోపణలు ... ఆపై సత్య ప్రమాణాలు ..అనపర్తి నేతల తీరు
వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు . అంతేకాదు తాము ఎలాంటి అవినీతి చెయ్యలేదని బిక్కవోలు గణపతి ఆలయంలో సత్తి ప్రమాణానికి సిద్ధమైన నేపథ్యంలో లక్ష్మీ గణపతి ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదట ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మి తో కలిసి గణపతి ఆలయానికి చేరుకుని సత్య ప్రమాణం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సత్య ప్రమాణాలు
ఆ తరువాత అక్కడికి 10 నిమిషాల వ్యవధిలో ఆలయానికి చేరుకున్న టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తన సతీమణి మహాలక్ష్మి తో కలిసి ఆలయంలో స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు. అయితే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు.ఇరువురు నేతలు ఆలయానికి వెళ్లి సత్య ప్రమాణం చేయడంతో బిక్కవోలు,అనపర్తి మండలాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సత్యప్రమాణాల సమయంలో ఆలయంలోకి ఎవరినీ అనుమతించని పోలీసులు
తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిక్కవోలు, అనపర్తి మండలాలలో 144 సెక్షన్ విధించి సెక్షన్ 30 పోలీస్ చట్టాన్ని అమలు చేస్తున్నారు. గుంపులుగా ఎవరు ఉండకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. అంతేకాదు నేతలు సత్య ప్రమాణాలు చేసే సమయంలో మీడియాను ఆలయంలోనికి అనుమతించలేదు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఘర్షణలు జరగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రాజకీయ నేతల గొడవల్లో దేవుడ్ని కూడానా ... స్థానికంగా చర్చ
అవినీతి ఆరోపణలు చేసుకోవటమే కాకుండా తామేం తప్పు చెయ్యలేదని ఇద్దరు నేతలు దేవుడి ముందు ప్రమాణం చెయ్యటంతో నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు . వీళ్ళ గొడవల్లో దేవుడ్ని లాగుతున్నారెందుకు అని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు . ఇక నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మోహరించిన పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. దాదాపు రెండు వందల మంది పోలీసులు అనపర్తి , బిక్కవోలు మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.