పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి బిగుస్తున్న ఉచ్చు- ఇళ్లలో సీఐడీ సోదాలు- క్రైస్తవ గ్రామాల అన్వేషణ
ఏపీలో విగ్రహాల ధ్వంసానికి ప్రధాన కారకుల్లో ఒకడిగా భావిస్తున్న పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చుట్టూ ఏపీ సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పాస్టర్ ప్రవీణ్ ఇళ్లు, అఫీసులు, ఇతర ఆస్తులపై సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. విగ్రహాల ధ్వంసంతో పాటు క్రైస్తవ గ్రామాలుగా మార్చిన ప్రాంతాల గురించి ఆరా తీస్తోంది. ఇందులో కీలక వివరాలు బయటికి వస్తాయని భావిస్తున్న సీఐడీ.. వీటి ఆధారంగా కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని చెబుతోంది.

పాస్టర్ ప్రవీణ్ ఇళ్లలో సీఐడీ సోదాలు
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలకు ప్రధాన కారకుల్లో ఒకడైన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిందితుడు ప్రవీణ్ తానే విగ్రహాలు ధ్వంసం చేసినట్లు, క్రైస్తవ గ్రామాలుగా కొన్ని గ్రామాలను మార్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించుకోవడాన్ని ప్రధాన ఆధారంగా పరిగణిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. నిన్న రాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, సామర్లకోట, చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రవీణ్ ఇళ్లు, ఇతర ఆస్తుల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో పలు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది.

విగ్రహాల విధ్వంసంపై కీలక ఆధారాలు
ఏపీలో పలు చోట్ల జరిగిన విగ్రహాల విధ్వంసంలో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పాత్రపై ఆరా తీస్తున్న సీఐడీ.. త్వరలో అతన్ని నేరుగా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రవీణ్ ఇళ్లు, ఆఫీసుల్లో దొరికిన ఆధారాలతో పక్కాగా ఉచ్చు బిగిస్తోంది. విగ్రహాల ధ్వంసానికి దారి తీసిన పరిస్ధితులతో పాటు ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు సాగుతోంది. అందుకే ప్రవీణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను సైతం ప్రశ్నించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.

క్రైస్తవ గ్రామాల అన్వేషణ
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తాను తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామాల్ని క్రైస్తవ గ్రామాలుగా మార్చినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామాల వివరాలను తెలుసుకునేందుకు సీఐడీ ప్రయత్నిస్తోంది. ఆయా గ్రామాలు ఎక్కడున్నాయనే దానిపై సీఐడీ ఆరా తీస్తోంది. క్రైస్తవ గ్రామాలుగా మార్చిన వివరాలు లభ్యమైతే కేసులో పురోగతి సాధించినట్లవుతుందని సీఐడీ డీఎస్పీ రాధిక చెప్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రవీణ్‌కు బలమైన నెట్‌వర్క్ ఉందని అనుమానిస్తున్నారు.
త్వరలో ఈ గ్రామాల గుర్తింపుతో పాటు దానికి దారి తీసిన పరిస్ధితులపై వివరాలు బయటికొస్తాయని సీఐడీ చెబుతోంది.