అంతర్వేది ఘటనతో దేవుళ్ళ రథాలపై ఏపీ సర్కార్ దృష్టి .. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు, రథాల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వ అసమర్థ వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.ఇక ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రముఖ ఆలయాల్లోని దేవతామూర్తులను, రథాలను సంరక్షించేందుకు రంగంలోకి దిగింది .

ఆలయాలకు , రథాలకు రక్షణా చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం
హిందూ ఆలయాలలో ఉండే రథాలపై మరింత నిఘా పెంచాలని ఆదేశించిన ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అంతేకాదు రక్షణ సిబ్బందిని కూడా నియమించాలని, అతిపురాతనమైన రథాలకు సంబంధించి ఇన్సూరెన్స్ లు కూడా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు సంబంధించిన అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆలయాల పరిస్థితిని, ఆలయాల రథాల పరిస్థితిని, రక్షణ వ్యవస్థను పటిష్టంగా చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వంతో చర్చిస్తున్నారు.

ద్వారకా తిరుమలలో శ్రీవారి రథాలకు భద్రత
ప్రధాన ఆలయాలలో ఒకటైన ద్వారకాతిరుమలలో శ్రీవారి చిన్న వెంకన్న రథాన్ని, అలాగే కుంకుళ్ళమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురం లోని జగన్నాథ స్వామి వారి రథాన్ని, రథ శాలలను పోలీసు అధికారులు పర్యవేక్షించారు. రథాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను పోలీసులు, దేవస్థాన అధికారులు సంయుక్తంగా కలిసి చర్చిస్తున్నారు. ఈ రథాల పర్యవేక్షణకు ఏర్పాట్లు చేయడంతో పాటుగా, రక్షణగా కాపలా సిబ్బందిని నియమించనున్నారు. అంతేకాదు రథాలకు ఇన్సూరెన్స్ కూడా చేయాలని నిర్ణయించిన అధికారులు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మూడు రథాలకు ఇన్సూరెన్స్ చేయించారు.

విజయనగరం జిల్లాలోనూ ఆలయాలకు, రథాలకు రక్షణా చర్యలు
రథానికి ఎదురుగా ఒక నిఘా కెమెరా ఏర్పాటు చేయడంతో పాటుగా, ఇరువైపులా వెనుక భాగంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అధికార యంత్రాంగం నిరంతరం వాటిని పర్యవేక్షించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ఆలయాల వద్ద రథాలకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో జగన్నాథ స్వామి ఆలయం వద్ద ఉన్న రథాలకు రామతీర్థం దేవస్థానంలోని రథానికి సి సి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

అనతపురం జిల్లాలోనూ ఏర్పాట్లు
అంతర్వేది ఘటన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా దేవాలయాలకు సంబంధించిన రథాలకు పోలీసులు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు . జిల్లాలో ఉన్న ప్రతి రథాన్ని సందర్శించి దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన పోలీసులు రథాలకు రేయింబవళ్ళు రక్షణ కల్పించి వాటిని పరిరక్షించడానికి కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కదిరి ,కసాపురం, మురడి నేమకల్లు, పెన్నహోబిలం, తాడిపత్రి ,దొండపాడు, హైమావతి , పంపనూరు, లేపాక్షి తదితర ప్రాంతాల్లో దేవాలయాలను సందర్శించిన పోలీసులు రథాల రక్షణ పై పలు జాగ్రత్తలు తీసుకున్నారు .

రథాలకు లైటింగ్ , కాపలా సిబ్బంది , సీసీ కెమెరాలు , ఇన్సూరెన్స్
రథం ఉన్న ప్రాంతంలో లైటింగ్ ఉండేలా చూడటంతో పాటుగా సిసి కెమెరాలను, కాపలా దారులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆలయాల్లోని దేవతామూర్తులు, రథాల పరిరక్షణపై ప్రత్యేకమైన దృష్టి సారించింది ఏపీ సర్కార్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆలయాల విషయంలో ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ప్రభుత్వం తమ పారదర్శకతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది .