జగన్ సర్కారు కీలక నిర్ణయం: అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
సీబీఐ విచారణకు ఆదేశం..
ముఖ్యమంత్రి ఆదేశాలతో అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం అధికారులు లేఖ పంపారు. సీబీఐకి అప్పగించే విషయమై శుక్రవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. గత శనివారం అర్ధరాత్రి దాటాక రథం దగ్ధమైన విషయం తెలిసిందే. సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని సుమారు 60ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు.

రథం దగ్ధంపై ఆగ్రహ జ్వాలలు..
స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమవడంపై రాజకీయ పార్టీల నేతలు, హిందూ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రథం దగ్ధం కుట్రపూరితంగానే ఉందని ఆరోపించాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో...
కాగా, అంతర్వేది ఘటనపై బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టాయి. సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన సర్కారు.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేసింది. కొత్త రథం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.