నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
కాకినాడ: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కొనసాగుతోన్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వివాదం గాలివానగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ వైఖరికి కారణమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీ ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఎన్జీఓ సంఘాల మధ్య ఎన్నికల నిర్వహణ అనేది ప్రతిష్ఠాత్మక అంశంగా మారింది. చివరికి అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?

రాజకీయ నేతగా..
దీనిపై తాజాగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆయన నిమ్మగడ్డకు బహిరంగ లేఖ రాశారు. నిమ్మగడ్డ వైఖరి నవ్వు తెప్పిస్తోందంటూ ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని, అదే ఆయనను నడిపిస్తోందనే అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వరుసగా చేస్తోన్న దాడి విచారకరమని, రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహించాలి తప్ప.. రాజకీయ నాయకుల తరహాలో పట్టుదలకు పోవడం ఏ మాత్రం మంచిది కాదని అన్నారు.

నేరం నాది కాదు.. ఆకలిది అన్నట్టుంది..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి చూస్తోంటే.. ఎన్టీ రామారావు నటించిన నేరం నాది కాదు ఆకలిది అనే సినిమా గుర్తుకు వస్తోందని ముద్రగడ వ్యాఖ్యానించారు. నేరం నిమ్మగడ్డది కాదని, ఆ అదృశ్య వ్యక్తిదేననేది అందరికీ తెలిసిపోయిందని అన్నారు. ఈ తలనొప్పులన్నింటికీ ఆ అదృశ్య వ్యక్తే కారణమని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. పెద్ద చదువు చదువుకుని, పెద్ద హోదాలో ఉన్న నిమ్మగడ్డ.. ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ రాజకీయాలు చేయడం సరికాదని హితబోధ చేశారు. ప్రభుత్వ-నిమ్మగడ్డ మధ్య తగాదాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.

ఇలాంటి పరిస్థితి దేశంలోనే మొదటిసారి..
ఈ తరహా పరిస్థితులు దేశంలోనే మొదటిసారిగా తాను చూస్తున్నానని ముద్రగడ అన్నారు. నిమ్మగడ్డ తనకు ఉన్న విశిష్ఠ అధికారాలతో సంస్కరనలనుతీసుకుని రావాలి తప్ప.. ఇలాంటి వివాదాలకు కేంద్రం కాకూడదని చెప్పారు. మద్యం, డబ్బులు పంపిణీ చేయకుండా ఎన్నికలను నిర్వహించగలమని సంబంధిత అధికారులు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. వాటిపై ఏ అధికారి కూడా దృష్టి పెట్టరని, ప్రకటనల వరకే తప్ప లోతుగా ఆలోచించలేరని, నిర్ణయాలు గానీ, చర్యలను గానీ తీసుకోలేరని మండిపడ్డారు.

ఖజానాకు గండి..
ప్రభుత్వం-ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య చెలరేగుతోన్న వివాదాలు, న్యాయస్థానాల్లో పిటీషన్లు, కేసుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందని ముద్రగడ అన్నారు. ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ కార్యాలయం కలిసి ఖజానాను కొల్లగొడుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టార్జితంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలే తప్ప పంతాలు పట్టింపులకు పోయి దుర్వినియోగం చేయకూడదని చెప్పారు. ఒక బాధ్యత గల పౌరుడిగా తాను తన అభిప్రాయాన్ని తెలియజేశానని, తన లేఖపై సానుకూలంగా స్పందించాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు.