ఏపీలో ఇంగ్లీష్ మీడియం రచ్చ ... తన వ్యాఖ్యలపై ఎంపీ క్లారిటీ .. జగన్ ఓకే అంటారా ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన సాగించాలని నిర్ణయించడంతో పాటు,తెలుగు మీడియం తీసివేయాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పైన విమర్శలు గుప్పిస్తున్నాయి. మాతృభాషని మృతభాష గా మార్చవద్దని నిన్నటికి నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్‌కు అల్లూరి కృష్ణంరాజు ఝలక్..వైసీపీలో రాజోలు మాజీ ఎమ్మెల్యే చేరిక

ఎంపీపై జగన్ ఆగ్రహం .. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
ఇక ఇదే సమయంలో లోక్‌సభలో ఏపీలో తెలుగు మీడియం తీసివేత అంశంపై పెద్ద చర్చ జరిగింది. ఇక ఈ చర్చలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనకు వ్యతిరేకంగా ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.
లోక్‌సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అన్న రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో కేశినేని నాని తెలుగుభాష ప్రస్తావన తీసుకు వచ్చారని పేర్కొన్నారు.

లోక్ సభలో ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట్లాడిన వ్యాఖ్యలపై స్పష్టత
ప్రాచీన భాషల విషయంలో క్లాసికల్ లాంగ్వేజెస్ సెంటర్ మైసూర్లో ఉంది. అక్కడి నుంచి ఏపీకి మారుస్తున్నారా? అన్న ప్రశ్నపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా కేశినేని నాని ఏపీలో తెలుగు మీడియాన్ని పక్కన బెడుతున్నారని అన్నారు. దానిపై స్పందించిన రఘురామకృష్ణం రాజు చంద్రబాబు హయాంలో తెలుగు భాష కోసం ఏమీపని చేయలేదు అని పేర్కొన్నారు . ఐదేళ్లలో తెలుగు అకాడమీయే లేదుని జగన్ సీఎం అయ్యాక తెలుగు అకాడమీని పునరుద్దరించి లక్ష్మీపార్వతి ఛైర్‌పర్సన్‌గా నియమించారని చెప్పారు.

తెలుగు అకాడమీకి రావాల్సిన నిధుల కోసమే మాట్లాడానన్న ఎంపీ
విభజన చట్టం సెక్షన్-10 ప్రకారం ఆస్తుల విభజన జరగలేదని.. అలాజరిగితే రూ.200 కోట్లు వస్తాయి. భాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆర్టికల్ 350, 350-Aలో ఉందని.. మీరు బాధ్యత తీసుకొని తెలుగు అకాడమీకి నిధులను త్వరగా ఇప్పించాలని చెప్పారు రఘురామ కృష్ణం రాజు ఏపీలో తెలుగు మీడియం లేకుండా చేస్తున్నారని లోక్‌సభలో మాట్లాడిన క్రమంలో, తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి మాత్రమే మాట్లాడానని రఘురామకృష్ణంరాజు స్పష్టంగా చెప్పారు.అంతేకాకుండా తాను తెలుగు అకాడమీకి రావాల్సిన నిధుల కోసమే మాట్లాడానని, అసలు ఇంగ్లీష్ అనే పదాన్ని ఎక్కడ కూడా వాడలేదని వివరించారు.

తనపై వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలన్న రఘురామ కృష్ణం రాజు
ఇకపోతే తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమని, అవసరమనుకుంటే పార్టీ కి సంజాయిషీ ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అంతేకాదు ఇంగ్లీష్ మాధ్యమానికి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని ఆయన పేర్కొన్నారు. తెలుగుభాష కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న రఘురామ కృష్ణంరాజు, తెలుగు భాషను ప్రేమించడం తప్పు అయితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని తెలిపారు. మరి ఇంతగా క్లారిటీ ఇచ్చిన రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి . ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం అంశంపై ఎవరూ మాట్లాడవద్దు అని ,అలా మాట్లాడితే ఉపేక్షించబోనని సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!