భార్యా, కుమార్తెలపై పైశాచికం: అశ్లీల చిత్రాలు చూస్తూ, భార్యపై డంబెల్‌తో దాడి
తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న పిల్లలముందే అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు కట్టుకున్న భార్యపై డంబెల్‌తో దాడి చేశాడు. దీంతో ఆమెకు తలకు తీవ్రగాయమైంది.

కుమార్తెల ముందే నీలి చిత్రాలు చూస్తూ..
బాధితురాల మాధవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న భర్త దంగేటి శ్రీను గత కొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. ఫుటుగా మద్యం తాగి వచ్చి కుమార్తెల ముంబే నీలి చిత్రాలు చూసేవాడు. భర్త తీరు నచ్చని భార్య మాధవి ఈ విషయంపై అనేకమార్లు భర్తతో గొడవపడింది.

కుమార్తెలు బతిమాలినా.. భార్యపై డంబెల్‌తో దాడి...
రెండ్రోజుల క్రితం కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఇంట్లో ఉన్న డంబెల్ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. అమ్మను కొట్టవద్దూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కన్నకూతుర్లు బతిలాడినా ఏమాత్రం పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను కుమార్తెలు ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త దాడిలో తీవ్రగాయాలపాలైన మాధవిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

గతంలోనూ పైశాచికానందం కోసం..
తన భర్త నుంచి తనకు, తన కుమార్తెలకు ప్రాణహాని ఉందని మాధవి ఆరోపించారు. ఈ మేరకు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. గతంలోనూ భార్య, పిల్లలు చిత్రహింసలకు గురిచేస్తే.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. అయితే, భర్త ఉద్యోగం పోతుందనే భయంతో ఫిర్యాదును ఉపసంహరించుకుంది. దీంతో భార్యా, పిల్లలకు అతడి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. కొద్ది రోజుల క్రితం భార్యను హత్యచేసేందుకు కూడా ప్రయత్నించగా.. బంధువులు అడ్డుకున్నారు. తాజా ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్థానికంగా ఈ ఘటన అలజడి రేపింది.