ఛలో అమలాపురం.. అనుమతి లేదు.. మత విద్వేషాలు రగిలిస్తే సహించం : ఏలూరు రేంజ్ డీఐజీ వార్నింగ్
హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. హిందూ వాదులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఈ రోజు ఛలో అమలాపురంకు పిలుపునిచ్చారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలీసులు బీజేపీ నిర్వహించ తలపెట్టిన ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకుల అరెస్టులు, హౌస్ అరెస్టు పర్వాలు కొనసాగుతున్నాయి.
అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !!

ఛలో అమలాపురానికి అనుమతుల్లేవ్ .. ఏలూరు రేంజ్ డిఐజి కే వి మోహన్ రావు
ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతులు లేవని, మత విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నిస్తే అణిచి వేస్తామని ఏలూరు రేంజ్ డిఐజి కే వి మోహన్ రావు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సంయమనంతో ఉండాలని రాజకీయ పార్టీలు ఛలో అంతర్వేది , ఛలో అమలాపురం అంటూ పిలుపునిస్తున్నాయి అని , ఎవరూ రావద్దని ,వాటికి ఎటువంటి అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని అమలాపురంలో 34, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు తెలియజేయడానికి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని తేల్చిచెప్పారు. బిజెపి మాత్రం ఛలో అమలాపురం కార్యక్రమం నిర్వహించి తీరుతామని తేల్చి చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దమనకాండను దేశవ్యాప్తంగా తెలియజేసే ఉద్దేశ్యంలో భాగంగా, అదే విధంగా హిందూ దేవాలయాల పరిరక్షణ ప్రధాన డిమాండ్ గా బిజెపి ఛలో అమలాపురం ఆందోళన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాలనుకున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు .. మండిపడుతున్న బీజేపీ నాయకులు
పోలీసులు బిజెపి నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు, విష్ణు వర్ధన్ రెడ్డి తదితర బిజెపి ప్రధాన నాయకులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ప్రకాశం జిల్లా కారంచేడులో బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధరేశ్వరి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిన రావెల కిషోర్ బాబు ను హనుమాన్ జంక్షన్ లో పోలీసులుఛలో అమలాపురం కార్యక్రమాన్ని భగ్నం చేయడంలో భాగంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఛలో అమలాపురం నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించి పహారా కాస్తున్నారు . రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అలర్ట్ అయిన పోలీసులు ప్రతి జిల్లాలోనూ బీజేపీ నాయకులను ఛలో అమలాపురం కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు పోలీసుల తీరుపై, ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై మండిపడుతున్నారు.