సీఆర్పీసీ 30: పోలీసుల గుప్పిట్లో కోనసీమ..ఉద్రిక్తత: అడుగడుగునా: పోలీసుల అదుపులో కమలనాథులు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తలపెట్టిన ఛలో అమలాపురం ఆందోళనతో కోనసీమలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడుగడుగునా మోహరించారు. 144 సెక్షన్‌ను విధించారు. క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) 30 అమల్లోకి తీసుకొచ్చారు.
బీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురం

ఛలో అమలాపురం అడ్డుకోవడానికి..
బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకున్నారు. అంతర్వేది ఆలయానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడం, హిందూ ఆలయాలపై వరుసగా దాడులు చోటు చేసుకోవడానికి నిరసనగా బీజేపీ నాయకులు ఛలో అమలాపురం ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనను భగ్నం చేయడంలో భాగంగా పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు.

బీజేపీ నేతలు ఎక్కడికక్కడ..
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ జాతీయ మహిళా మోర్చా నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని గృహనిర్బంధంలో ఉంచారు. బీజేపీ ఉపాధ్యక్షులు రావెల కిశోర్‌బాబు, ఆదినారాయణ రెడ్డిలను అదుపులో తీసుకున్నారు. ఛలో అమలాపురం ఆందోళనలో పాల్గొనడానికి బయలుదేరిన నేతలను అదుపులో తీసుకుంటున్నారు. బయటి వ్యక్తులెవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. కోనసీమ ప్రాంతానికే చెందిన బీజేపీ నేతలను నిర్బంధించారు.

గుర్తు తెలియని ప్రదేశానికి విష్ణువర్ధన్ రెడ్డి
అమలాపురానికి బయలుదేరి వెళ్లినరావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్లో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారమే అమలాపురానికి చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అమలాపురం నుంచి పోలీస్ వాహనంలో గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాకు విడుదల చేశారు.
మరోవంక- కోనసీమ ప్రాంతం మొత్తాన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

144 సెక్షన్ విధింపు..
అమలాపురంలో 144 సెక్షన్‌ను విధించారు. అత్యంత అరుదుగా వినియోగించే సీఆర్పీసీ 30ని అమలు చేస్తున్నారు. అమలాపురంలో దుకాణాలను మూసివేశారు. పోలీసులను భారీగా మోహరింపజేశారు. కోనసీమకు వచ్చే అన్ని దారులను బ్యారికేడ్లతో మూసివేశారు. ఈ పరిణామాలతో కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గృహనిర్బంధాల పట్ల బీజేపీ నేతల తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్రంలోొ పోలీసు రాజ్యం నడుస్తోందని భగ్గుమంటున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శిస్తున్నారు.