రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల గుడ్‌బై? ఆస్తులు పోగొట్టుకున్నాం: వారసుడి పేరు వెల్లడి
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయాలకు త్వరలో వీడ్కోలు పలకబోతున్నారా? క్రీయాశీలక రాజకీయాలకు దూరం కాబోతోన్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు నేరుగా వెల్లడించనప్పటికీ.. తన తదుపరి రాజకీయ వారసుడిని ప్రకటించారు. త్వరలో తెలుగుదేశం పార్టీ సభాపక్ష ఉపనేత హోదా నుంచి కూడా తప్పుకొంటానని తెలిపారు. తన వారసుడి పేరును వెల్లడించడానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదని తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
దీపావళి బాణాసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: ఆ పిటీషన్ కొట్టివేత

వారసుడిగా రవిరామ్ కిరణ్
తన వారసుడిగా డాక్టర్ రవిరామ్ కిరణ్ పేరును బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. రవిరామ్ కిరణ్.. బుచ్చయ్య చౌదరి సోదరుడు శాంతారావు కుమారుడు. అమెరికాలో స్థిరపడ్డారు. త్వరలోనే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని చెప్పారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.

కమ్యూనిస్టు కుటుంబం నుంచి..
ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచీ తమ కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశాయని అన్నారు. తన తల్లిదండ్రులు, మేనమామలు కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని, ఆస్తులను పోగొట్టుకున్నారని, పార్టీ కోసం త్యాగాలు చేశారని అన్నారు. వారి వారసత్వాన్ని తాను కొనసాగించానని బుచ్చయ్య చౌదరి చెప్పారు. 38 సంవత్సరాలుగా తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎక్కడా ఒక్క మాట తప్పలేదని, మడమ తిప్పలేదని చెప్పారు. కష్టనష్టాలను భరించానని అన్నారు.

సిద్ధాంతాలను మార్చుకోలేదు..
రాజకీయాల్లో తాను పదవులను ఏనాడూ ఆశించలేదని, నమ్ముకున్న వారిని, ఓట్లేసిన ప్రజల సంక్షేమం కోసం శ్రమించానని అన్నారు. ఇప్పటికీ తాను విలువలతో కూడిన రాజకీయాలను చేస్తున్నానని చెప్పారు. సిద్ధాంతాలను మార్చుకోలేదని, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మెలిగానని అన్నారు. ఇకముందు రాజకీయాల్లో కొనసాగాలా? లేదా? అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని బుచ్చయ్య చౌదరి చెప్పారు. తాను ఎన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతాననేది దైవనిర్ణయంగా అభివర్ణించారు.

టీడీఎల్పీ హోదాకు రాజీనామా..
తెలుగుదేశం పార్టీ సభాపక్ష ఉప నాయకుడి హోదాకు రాజీనామా చేయాలని నిర్క్షయించుకున్నానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఆ పదవిని పార్టీని నమ్ముకుని ఉన్న వెనుకబడిన వర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సభ్యుడికి అప్పగించాలని తాను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతానని వెల్లడించారు. త్వరలో డాక్టర్ రవిరామ్ కిరణ్.. క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

రాజమండ్రి సిటీ స్థానమే ఎందుకు?
రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి రవిరామ్ కిరణ్.. రాజకీయ ప్రస్థానాన్ని చేపడతారంటూ బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎందుకంటే- ఈ స్థానం టీడీపీ నేత ఆదిరెడ్డి కుటుంబానికి చెందినది. ప్రస్తుతం ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆదిరెడ్డి భవానీ అక్కడ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రవిరామ్ కిరణ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆదిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పడానికే రవిరామ్ కిరణ్‌ను బరిలో దింపుతున్నారా? అనే సందేహాలకు కూడా తావిస్తోంది.