వ్యూహం మార్చిన రఘురామ- సర్కారులోనే ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు- ఫలించేనా ?
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ప్లాన్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వంపైనా, పార్టీ అధినేతపైనా, ప్రభుత్వ కార్యక్రమాలపైనా విమర్శలు చేస్తున్న రఘురామరాజు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారి మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తొలి అడుగుగా తనపై సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న డిజిటల్ డైరెక్టర్‌పై ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఫిర్యాదు లేఖ రాశారు. చర్యలు తీసుకోకపోతే ఏం చేయబోతున్నారో కూడా అందులోనే రఘురామ వివరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం కలకలం రేపుతోంది.

వ్యూహం మార్చిన రఘురామ...
ఇప్పటివరకూ వైసీపీ ప్రభుత్వంలో వరుస విమర్శలతో కలకలం రేపుతున్న ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా వ్యూహం మార్చారు. ఇప్పటివరకూ పార్టీలోనే అంతర్గతంగా పోరు పెట్టేందుకు తన పోరాటాన్ని వాడుకుంటున్న రఘురామ ఇప్పుడు తాజాగా ప్రభుత్వ వర్గాల మధ్య కూడా తగాదాలకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో తొలి అడుగుగా తనపై సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న సమాచారశాఖ డిజిటల్ డైరెక్టర్ దేవేంద్రరెడ్డిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి ఆయన తాజాగా ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తన లేఖపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. లేకపోతే ఏం చేయబోతున్నారో కూడా ఆ లేఖలో వివరించారు.

ఎంపీపై ఉద్యోగి సోషల్ పోస్టులా ?
గౌరవ ఎంపీ అయిన తనపై మీ ప్రభుత్వ ఉద్యోగి అయిన సమాచార శాఖ డిజిటల్ డైరెక్టర్ దేవేంద్రరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారంటూ తన లేఖలో రఘురామరాజు ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీని ప్రశ్నించారు. సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా పోస్టులు పెట్టడం తీవ్ర అభ్యంతరకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయనపై తక్షణం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తన లేఖలో రఘురామరాజు నీలం సాహ్నీని కోరారు. దీంతో రఘురామరాజు ప్రభుత్వంలోని వారిపై ప్రభుత్వం ద్వారానే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ..
ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఎంపీపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దేవేంద్రరెడ్డి వ్యవహారంపై తక్షణం విచారణ జరిపించాలని కోరిన రఘురామ.. అందులో ఆలస్యమైతే పార్లమెంటు సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరికలు కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలో వద్దో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయించాల్సిన పరిస్ధితి తలెత్తింది. తొందరపడి దేవేంద్రరెడ్డిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పెద్దల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది. అలా కాదని ఆలస్యం చేస్తే పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ వరకూ ఈ ఫిర్యాదు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫిర్యాదుపై నీలం సాహ్నీ ఏం చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

వ్యూహం ఫలిస్తుందా ?
జగన్ సర్కారు వేలితోనే కంట్లో పొడిపించాలనే ఉద్దేశంతో రెబెల్ ఎంపీ రఘురామరాజు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే భద్రతపై ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టుకు, కేంద్ర హోంశాఖకు వెళ్లి సాధించుకున్న రఘురామరాజు.. సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులకో, పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకో ఫిర్యాదు చేస్తే జగన్ సర్కారుకు ఇది మరో తలనొప్పిగా మారనుందనడంలో ఆశ్చర్యం లేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వాస్తవానికి ఇది ప్రభుత్వం కంటే ప్రస్తుతం గడువు పొడిగింపుపై బాధ్యతల్లో ఉన్న నీలం సాహ్నీకి సైతం ఇబ్బందికరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.