హెల్త్ మినిస్టర్ ఇలాఖాలో దారుణం... ప్రభుత్వ ఆస్పత్రిలో కళ్లను పీక్కుతిన్న ఎలుకలు
ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మూర్చురీలో భద్రపరిచి ఉన్న ఓ మృతదేహం కళ్లను ఎలుకలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

మార్చురీలో మృతదేహం..కళ్లను పీక్కుతిన్న ఎలుకలు
మంగళవారం రాత్రి వైకుంట వాసు అనే చిన్నస్థాయి కాంట్రాక్టర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. లింగంపాలెం మండలంకు చెందిన వాసును జోగన్నపాలెం వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి అదే రోజు రాత్రికి తరలించారు. మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని హాస్పిటల్‌కు చేరుకున్నారు. మృతదేహాన్ని చూడగా కళ్లు, కనుబొమ్మలను ఎలుకలు తిన్నట్లుగా గుర్తించారు. వెంటనే వైద్యులు పోస్టు మార్టం నిర్వహించిన విషయం బయటకు పొక్కకుండా చూసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు
హాస్పిటల్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఓ ఏజెన్సీని నియమించుకోగా ఆ సిబ్బంది పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో విఫలమైందని అధికారులు మండిపడ్డారు. అక్కడ ఎలుకలు తిరుగుతున్నాయంటే ఇందుకు కారణం ఏజెన్సీ ద్వారా నియమించబడ్డ సిబ్బంది నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. ఏజెన్సీకి మెమో జారీ చేస్తామని హాస్పిటల్ పాలనా విభాగం చెప్పింది. మార్చురీ వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది పై కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ ఆదేశించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏఎస్ రామ్ చెప్పారు.

మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు
ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం కూడా కన్నాపురంకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా అతని కళ్లను కూడా ఎలుకలు పీక్కుతిన్నట్లు మృతుడి బంధువులు చెప్పారు. మరోవైపు హాస్పిటల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు ఉన్న ఫ్రీజర్లు పనిచేయడం లేదని సమాచారం.మార్చురీలో మొత్తం ఆరు ఫ్రీజర్లు ఉండగా ఒక్కటి మాత్రమే పనిచేస్తోందని మిగతా ఐదు పనిచేయడం లేదని సమాచారం. ఇక ఏజెన్సీ ద్వారా నియమించబడ్డ సిబ్బంది పనిచేయని ఫ్రీజర్ల దగ్గర పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయడం లేదని సమాచారం. దీంతోనే ఎలుకలు అక్కడికి ప్రవేశించి ఉంటాయనే అనుమానం వ్యక్తమవుతోంది.