జంగారెడ్డిగూడెం మరణాలు..హత్యల కంటే తీవ్ర నేరం: ఆ కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న నాటుసారా మరణాలు రాష్ట్రంలో ప్రకంపనలను సృష్టిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ దాడికి దారి తీశాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా కొనసాగుతుండటంతో ఈ ఘటన తీవ్రత అధికంగా ఉంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన, వామపక్షాలు- జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తోన్నాయి.

అసెంబ్లీ సాక్షిగా..
ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలన్నింటికీ నాటుసారా కారణం కాదంటూ స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సహా ఇతర మంత్రులు అక్కడి వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఓ ప్రకటన చేశారు.

జంగారెడ్డిగూడెంలో పర్యటించిన నాగబాబు
ఈ పరిణామాల మధ్య జనసేన నాయకుడు నాగబాబు తాజాగా ఈ ఘటనపై స్పందించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి చెందిన ఘటన తనను కలచి వేసిందని, అవన్నీ నాటుసారా మరణాలేనని నాగబాబు స్పష్టం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి- మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

మిథేన్ కలిసిన నాటుసారా..
ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అత్యంత ప్రమాదకరమైన మిథేన్ కలిసిన నాటుసారాను తాగి వారు మరణించారని నాగబాబు తేల్చి చెప్పారు. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే మిథేన్‌ను నాటుసారాలో ఎలా కలిసిందనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మానవ అవసరాల కోసం ఎంతమాత్రం మిథేన్‌ను వినియోగకరమైనది కాదని చెప్పారు.

అల్కహాల్ రేట్లను పెంచడం వల్లే..
ప్రజల మద్యం అలవాట్లను మానిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆల్కహాల్ ధరలను భారీగా పెంచేయడం వల్ల దినసరి వేతన కార్మికులు, కూలీపనులకు వెళ్లేవారు నాటుసారాకు అలవాటు పడ్డారని నాగబాబు చెప్పారు. అదే ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో18 మంది మరణానికి కారణమైందని అన్నారు. తాను జంగారెడ్డిగూడెం ఆసుపత్రి డాక్టర్‌ను కలిశానని, ఆయన కూడా మిథేన్ కలిసిన నాటుసారా వల్లే వారు మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు.

ముఖ్యమంత్రి సైతం వ్యతిరేకంగా స్పందించడం సరికాదు..
జంగారెడ్డిగూడెం మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని నాగబాబు అన్నారు. జగన్ స్పందించిన విధానాన్ని బట్టి చూస్తే- ఆయనకు సరైన సమాచారం అందలేదని అర్థమౌతోందని చెప్పారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మరణాలు- హత్యానేరం కంటే తీవ్రమైనవని వ్యాఖ్యానించారు. నిందితులను అరెస్ట్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.


ఆర్థిక సహాయం అందించకపోతే..
ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను ఎలాంటి రాజకీయం చేయదలచుకోలేదని, మృతులందరూ చిన్నా, చితక పనులు చేసుకుని జీవించేవారని అన్నారు. ఆర్థిక సహాయం చేయకపోతే మాత్రం ఆ 18 కుటుంబాల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుందని నాగబాబు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ మరణాలు సంభవించాయని తేల్చి చెప్పారు.