వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్ 'కన్నీపాట' కథనం వెనక కథ

By Pratap
|
Google Oneindia TeluguNews

పత్రికను నడపడంలోనూ వ్యూహాలూ ఎత్తుగడలూ ఉంటాయి. మరీ, ముఖ్యంగా మ్యాగజైన్ జర్నలిజంలో ఇది ఎక్కువగా ఉంటుందనుకుంటాను. పత్రికా రంగంలో ఎబికె ప్రసాద్‌కు మించినవారు లేరు. పత్రికలను ప్రారంభించి, విజయవంతంగా నడపడంలో ఆయనకు తెలుగు జర్నలిజంలో తిరుగులేని సత్తా ఉంది. ఉదయం, వార్త వంటి పత్రికలే కాకుండా సుప్రభాతం అనే సామాజిక రాజకీయ వారపత్రిక కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభమైంది.

పత్రికలను ప్రారంభించి నడిపించడంలో ఆయనది ఆలోచన కాగా, మరో ప్రముఖ జర్నలిస్టు వాసుదేవరావుది ఆచరణ. ఇద్దరు కలిశారంటే టీమ్ సెలక్షన్ నుంచి పత్రికను పాఠకులకు చేరే వేసే దాకు విజయవంతంగా సాగుతుందనేది ప్రగాఢ విశ్వాసం. వార్త దినపత్రికను ప్రారంభించినప్పుడు మాత్రమే ఎబికె వెంట వాసుదేవ రావు లేరు. ఆయన సుప్రభాతంలోనే ఉండిపోయారు.

సుప్రభాతం ఎడిటోరియల్ బాధ్యుడిగా ఉన్న కాలంలోనే మా భూమి అనే వారపత్రిక ప్రారంభం అయింది. ఎబికె చేతుల మీదుగా అది ప్రారంభమవుతున్న తరుణంలో వాసుదేవరావు ఆ పత్రికకు వెళ్లిపోయారు. యాజమాన్యం వారించినా ఆయన వినలేదు. దాంతో సుప్రభాతం పత్రికకు ఎడిటోరియల్ బాధ్యతలు అనూహ్యంగా నా చేతుల్లోకి వచ్చాయి.

gaddar

ఎబికె చేతుల మీదుగా సామాజిక, రాజకీయ పత్రిక ప్రారంభమవుతున్నదంటే అది సుప్రభాతం పత్రికకు ప్రమాదకమైన సంకేతాలను అందిస్తున్నట్లే లెక్క. అయితే, సుప్రభాతం యజమాని, ఎడిటర్ లావు రత్తయ్య ఏం ఆలోచించారో తెలియదు గానీ వాసుదేవ రావు నిర్వహించిన బాధ్యతలను నాకు అప్పగించారు. నేను అప్పటికి వాసుదేవ రావు కింద అందులోనే పనిచేస్తున్నాను.

ఆ సమయంలో మా భూమిని ఎదుర్కోవడం నాకు సవాల్‌గానే నిలిచింది. ఆ సవాల్‌ను స్వీకరించడానికి కూడా సిద్ధపడ్డాను. అప్పటికి నాకు పట్టుమని 35 ఏళ్ల వయస్సు. ఉడుకు రక్తం కూడా. మా భూమిని సవాల్‌గా తీసుకుని ఓ ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చింది.

మా భూమి తొలి సంచికను ఎదుర్కుంటే, ఆ తర్వాత పని సులభమవుతుందనేది నా ఆలోచన. రెండింటినీ పాఠకులు పక్కపక్కన పెట్టి బేరీజు వేస్తారనే విషయం నాకు తెలుసు. తెలుగు మ్యాగజైన్ అంటే చాలా ఉన్నత శ్రేణి, చదువుకున్న వర్గానికి చెందిన పాఠకులకు సంబంధించిన వ్యవహారం.

మా భూమికి, మా సుప్రభాతం పత్రికకు యాదృచ్ఛికంగా ఫొటోలు ఇచ్చే ఫొటో జర్నలిస్టు ఒక్కరే. ఆయన బికె రమేష్. బికె రమేష్‌తో కలిసి నేను ఉదయం దినపత్రికలో చాలా కాలం పనిచేశాను. ఆ సాన్నిహిత్యం ఉంది. మా భూమికి ఫొటోలు ఇచ్చిన తర్వాత బికె రమేష్ నా దగ్గరికి వచ్చేవాడు. రెండు ఆఫీసులు కూడా బషీర్‌బాగ్‌లో దాదాపుగా పక్కపక్కనే.

నాలోని కల్లోలం నిజానికి బికె రమేష్‌కు తెలియదు. మా భూమిలో ఏం ఫొటోలు తీసుకున్నారంటే ఆయన చెప్పాడు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడ్డపార పట్టి భూమిని తవ్వుతున్న స్టిల్‌ను చూపించాడు. అంతే నాకు మా భూమిలో చేయబోయే కవర్ స్టోరీ ఏమిటో అర్థమైంది. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజల వద్దకు పాలనపై మా భూమిలో కవర్ స్టోరీ వస్తుందనే నిర్ధారణకు నేను వచ్చాను.

సుప్రభాతంలో మా కవర్ స్టోరీ పూర్తి భిన్నంగా ఉండాలని అనుకున్నాను. మా భూమికి, సుప్రభాతానికి మధ్య ఏ మాత్రం పోలిక లేదని, రెండు వేర్వేరు పత్రికలని, ఆ రెండింటి మార్గాలు భిన్నమైనవని చెప్పదలుచుకున్నారు. అలా అనిపించడంతో వెంటనే ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్‌ను సంప్రదించాను. ఓ రోజంతా మీతో ఉంటానని చెప్పాను. ఆయన అందుకు అంగీకరించారు.

అప్పుడు సుప్రభాతంలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న రమణతో కలిసి ఆల్వాల్ ప్రాంతంలోని వెంకటాపురం వెళ్లాను. ఉదయం పూటనే వెళ్లాను. మధ్యాహ్నం భోజనం విమలక్క వండిపెడితే చేశాం. టీలు తాగుతూ, భోజనాలు చేస్తూ గద్దర్‌తో నిరంతరాయంగా దాదాపు ఎనిమిది గంటల పాటు మాట్లాడుతూ వెళ్లాను. అలా మాట్లాడిన విషయాలతో ఓ వార్తాకథనం రాశాను.

దళిత కుటుంబం నుంచి వచ్చి చదువుల్లో మెరుగ్గా రాణిస్తూనే చదువుకోవడం ఎలా గగనమైందో వివరిస్తూ తాను విప్లవ మార్గం పట్టిన వైనాన్ని ఆయన వివరించారు. తన చిన్ననాటి జీవితాన్ని, తల్లితో పెనవేసుకున్న ప్రేమను ఆయన చాలా ఆర్ద్రంగా చెప్పారు. దాన్నంతా అక్షరాల్లోకి తెచ్చి, గద్దర్ విప్లవ కవిగా, ప్రజా కవిగా ప్రజలను పెద్ద యెత్తున కూడగట్టే వాహికగా ఎలా మారాడో వివరించాను. నిజానికి, అది గద్దర్ జీవితంలోని పరిణామ క్రమాన్ని వివరిస్తుంది.

దానికి కన్నీటి పాట అనే శీర్షిక పెట్టాం. నిజానికి, తన పాటలతో రక్తం ఉడుకెత్తించే విప్లవగేయాలు రాస్తూ ఆలపిస్తూ వ్యక్తే సమూహంగా మారిన గద్దర్ వార్తాకథనానికి కన్నీటి పాట అనే పేరు పెట్టడమేమిటని చాలా అనుకున్నారు. కానీ, కన్నీరే అగ్నిజ్వాలలు కురిపించే వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుందనేది దాని సారాంశంగా భావించాను.

మరోటి సందేహం కూడా చాలా మందికి వచ్చింది. గద్దర్ మీద కవర్ స్టోరీ చేయడానికి ఆ సమయంలోని సందర్భం ఏమిటనేది. సందర్భమనేది నేను కల్పించుకుందే తప్ప వేరేమీ లేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అప్పట్లో నేను ఇష్టపడలేదు.

గద్దర్ మీద కవర్ స్టోరీ చేద్దామని లావు రత్తయ్యగారికి చెప్పినప్పుడు ఆయన కూడా కొంత ఆశ్చర్యపోయినట్లే కనిపించారు. ఇప్పుడెందుకన్నారు. నేను నాలోని ఆలోచనలను చెప్పాను. కేవలం ఇది మా భూమితో మన పత్రికను పోల్చకుండా ఉండడానికి మాత్రమేనని చెప్పా. కానీ, గద్దర్ జీవితాన్ని సారంతో సహా అక్షరాల్లో చిత్రించిన గొప్ప అనుభవం మాత్రం నాకు మిగిలింది.

ఆ వార్తాకథనానికి గద్దర్ మేనల్లుడు సత్యం ఫోటోలను అందించాడు. ఆ ఫొటోలను చాలా మంది అప్పటి వరకు చూడలేదు. అది వార్తాకథనానికి మరింత ఆసక్తికరమైన విషయంగా మారింది. సత్యం గద్దర్‌కు సంబంధించిన అన్ని వివరాలను, ఫోటోలతో సహా భద్రపరుస్తూ ఉంటాడు. నా పత్రికా వృత్తిలో అదో మరుపురాని విషయంగానే ఉంటుంది.

English summary
Kasula Pratap Reddy narrated his experience on making a cover story on Gaddar for Suprabahtaham socio - political weekly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X