టీడీపీ మహిళానేత ఇంటిపై దాడి ఘటన; 16 మంది అనుమానితుల అరెస్ట్ .. కేసు విచారణపై గుంటూరు ఎస్పీ
టిడిపి మహిళా నాయకురాలు మాజీ జెడ్పిటిసి బత్తిని శారద ఇంటిపై వైసిపి అల్లరిమూకలు వీరంగం సృష్టించారని, పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ నాయకురాలు బత్తిని శారద ఇంటిపై మొదట రాళ్లతో దాడికి దిగిన అల్లరి మూకలు, ఆపై పెట్రోల్ పోసి వాహనాలను దగ్ధం చేయడంతో పాటుగా, ఇంటికి నిప్పంటించారు. పెద్ద పెద్ద బండ రాళ్ళను విసిరి రెండు గంటలపాటు విధ్వంసకాండ జరిపారు. వైసిపి రౌడీలపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నారని. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు తెలుగుదేశం నేతల పైన కాదు పోలీసుల పైన కూడా రాళ్ల దాడి చేసి, వారిని గాయపరిచారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ మహిళా నేత ఇంటిపై దాడి .. స్పందించిన ఎస్పీ
ఇక తాజాగా ఈ ఘటనపై గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పెదనందిపాడు పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా విశాల్ గున్నీ వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. నిందితులను పట్టుకోవడానికి బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సిఐ, పొన్నూరు రూరల్, మరియు అర్బన్ సిఐ లతో మూడు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అసలు ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు.

చట్టపరిధిలో నిస్పక్షపాతంగా విచారణ జరుపుతున్నాం
చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాదు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు. వినాయక విగ్రహాల నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ పార్టీకి సంబంధించిన వారు జెండాలు ఊపడంతో వేరే వర్గం రెచ్చిపోయిందని, దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందని, గొడవలలో భాగంగా 2 ద్విచక్ర వాహనాలు దహనం అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని సమాచారం. ఇక ఇరు వర్గాల వారు ఫిర్యాదు చేశారని, ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.
దాడిని ఖండించిన టీడీపీ.. పోలీస్ వ్యవస్థపై టీడీపీ ధ్వజం
ఇదిలా ఉంటే టిడిపి మహిళా నాయకురాలు ఇంటిపై జరిగిన దాడిని మాత్రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని తీవ్ర విమర్శలు చేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పాలన చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో ఘోరాతిఘోరమైన దారుణాలు జరుగుతున్నాయని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తోంది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయినప్పుడు అరాచక శక్తులు రాజ్యమేలుతాయని, ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్లే టిడిపి మహిళా నాయకురాలు ఇంటిపై వైసిపి అల్లరిమూకలు రెండు గంటలపాటు అరాచకం సృష్టించాయని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. టిడిపి మహిళా నేత ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దాడులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోకుంటే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తోంది.