మరుగుదొడ్డికీ పన్నువేసే పరిస్థితి: ఏపీ సర్కారుపై మరోసారి బాలకృష్ణ విమర్శలు
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రజలను అన్ని విధాలుగా జగన్ సర్కారు దోచుకుంటోందని విమర్శించారు. గుంటూరులోని జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అన్న క్యాంటీన్'ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
వైసీపీ పాలకులు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని బాలకృష్ణ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లోనూ తిరుగుబాటు వస్తోందన్నారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వంపై ఉద్యమించాలని ప్రజలకు బాలయ్య పిలుపునిచ్చారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు కృసి చేయాలన్నారు.

కాగా, ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు వేదికపైనుంచి కూడా బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కారు గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకమని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో ధరలు పెరిగాయని, అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.
దేశమంటే మనుషులు కాదు.. దేశమంటే మట్టేనోయ్ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనని బాలకృష్ణ ప్రశంసించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించారని, ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేలా చేశారని చంద్రబాబును కొనియాడారు.
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని అన్నారు బాలకృష్ణ. పార్టీకి ప్రజాశీస్సులు కావాలి. తెలుగు వారు కాని వాళ్లు కూడా తెలుగువాళ్లను గుర్తుపట్టేలా చేసిన ఘనత ఎన్టీఆర్దే. నువ్వు-నేను కలిస్తే మనం. మనం-మనం కలిస్తే జనం.. జనం-జనం కలిస్తే ప్రభంజనం. ఇప్పుడు మహానాడు పసుపు సైన్యం ఓ ప్రభంజనంలా తరలి వచ్చింది. శత పురుషుడి శత జయంతి జరుపుకుంటున్నాం. పేదోడికి గూడు, కూడు ఇవ్వాలని ఎన్టీఆర్ తపించేవారు. ఆయన పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకొస్తాయి' అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.