కొంపముంచిన పుట్టినరోజు హంగామా- 6గురు వాలంటీర్ల తొలగింపు-వార్డు సెక్రెటరీపై చర్యలు
గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టినరోజు వేడుకలు వార్డు సచివాలయ సిబ్బంది కొంప ముంచాయి. పట్టపగలే వార్డు సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే కాకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించినట్లు వీడియోలు బయటికి రావడంతో ప్రభుత్వం వీరిపై కన్నెర్ర చేసింది. చివరికి ఆరుగురు వాలంటీర్లకు ఉద్వాసన పలకడంతో పాటు ఈ ఘటనకు బాధ్యతగా వార్డు సెక్రటరీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తెనాలి మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది.

సచివాలయంలో పుట్టినరోజు...
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఆరో వార్డు సచివాలయంలో తాజాగా ఓ ఉద్యోగి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పుట్టినరోజంటే ఏదో కేవలం కేక్ కట్ చేసుకోవడం, స్వీట్లు పంచుకోవడం కాకుండా ఉద్యోగులు నానా హంగామా చేశారు. వార్డు సచివాలయం పరిధిలోకి వచ్చే ఆరుగురు వాలంటీర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేశాక పంచుకుని తినేయకుండా ఓ ఉద్యోగి మొహానికి దాన్ని పులుముతూ వార్డు వాలంటీర్లు హంగామా చేశారు. దాదాపు అరగంటపాటు సచివాలయంలో విధులు మానేసి పుట్టినరోజు పేరుతో చేసిన హంగామా అధికారుల దృష్టికి వెళ్లింది.

ప్రజలకు ఆసౌకర్యం కల్పించారంటూ..
వార్డు సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఓ ఎత్తయితే విధి నిర్వహణలో ఉంటూ పని మానేసి తోటి ఉద్యోగికి కేక్ పులుముతూ హంగామా సృష్టించడం మరో ఎత్తుగా మారింది. అదే సమయంలో సచివాలయంలో ప్రభుత్వ పథకాల వివరాల కోసం వచ్చిన లబ్దిదారులు వీరి తీరుతో నానా ఇబ్బందులు పడ్డారు. విధి నిర్వహణలో ఈ హంగామా ఏంటంటూ ప్రశ్నించినా పట్టించుకోకుండా వీరు వేడుకల్లో మునిగిపోయారు. దీంతో చివరికి వారు వెనుదిరగాల్సి వచ్చింది. అనంతరం వీరు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి పని చేయకుండా హంగామా చేస్తూ తమకు తీవ్ర అసౌకర్యం కల్పించారని ఆరోపించారు.

కమిషనర్ చర్యలు..
బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులై ఉండి విధి నిర్వహణ సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో పుట్టినరోజు పేరుతో హంగామా చేయడంపై తెనాలి పురపాలక కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉద్యోగులు హంగామా సృష్టించిన వీడియోలు కూడా బయటికి రావడంతో వారిపై వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లు తాడిబోయిన రత్నకుమారి, సోముపల్లి అలేఖ్య, ప్రభుకుమార్, షేక్ రహీమున్నీసా, యం,లావణ్య, లీలా హరీష్‌లను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే ఈ మొత్తం ఘటనకు బాధ్యతగా రెవెన్యూ సెక్రటరీ స్రవంతిని జిల్లా కలెక్టర్‌కు సరెండర్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.