కక్ష్యసాధింపులుండవు..అవినీతి చేసిన వారిని వదలం: ప్రతీ మాట నిలబెట్టుకుంటాం: సభలో జగన్..!
తాను ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. మూడు వారాల్లో తమ ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో స్పష్టం చేయగలిగామని చెప్పారు. ఇచ్చిన హామీలను నాలుగేళ్ల తరువాత కాకుండా..తొలి కేబినెట్ సమావేశం నుండి అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తన కేబినెట్లో సామాజిక కూర్పు దేశానికే ఆదర్శం గా నిలిచిందన్నారు జగన్. పధకాల అమల్లో రాజకీయ వివక్షలు ఉండవని ప్రకటించారు. నవ రత్నాలే తమ పాలనకు దిక్సూచి అని స్పష్టం చేసారు. అవినీతి రహిత పాలన అందిస్తామని..అవినీతి చేసిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. రైతులు..మహిళలకు అండగా నిలుస్తామని ప్రకటించారు.

ప్రతీ మాట అమలు చేస్తాము..
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్వహించిన తొలి శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 14న గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. రైతులకు ప్రాధాన్యత ఇస్తామని..ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా రైతులకు భీమా ప్రభుత్వమే కడుతుందని స్పష్టం చేసారు. దీని కోసం రైతు భరోసా అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తాం. ఇచ్చిన మట కంటే ఏడాది ముందే రైతు భరోసా పథకాన్ని అములు చేస్తాం. రైతన్నల సంక్షేమం కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రబుత్వ పాఠశాలల్లో పుస్తకాలు..విద్యార్దులకు యూనిఫాంలు..పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా నిర్వహించారని చెప్పుకొచ్చారు. మధ్నాహ్న భోజన బిల్లులు కూడా చెల్లించలేదని వివరించారు. పాఠశాల విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. అన్ని పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలుగా మార్చి..తెలుగు తప్పనిసరి చేస్తామని సీఎం సభలో వివరించారు.
ఏపి బీజేపి షాక్ ఇచ్చిన జగన్..! చౌరస్తాలో చంటి పిల్లాడిలా మారిని కమలం పార్టీ..!!

తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు..
తమ తొలి కేబినెట్ సమావేశంలోనే తమ హామీల అమలు ప్రారంభించామని జగన్ చెప్పకొచ్చారు. తాము మూడు వేలకు పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పామని..అందులో భాగంగా ఇప్పటికే 2250 చేసామని చెప్పారు. ఇచ్చిన
మాట ప్రకారం మూడు వేలకు పెంచుతామని స్పష్టం చేసారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఆశా వర్కర్లకు..పారిశుద్ద సిబ్బందికి జీతాలు పెంచామని వివరించారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామన హామీ ఇచ్చామని..తొలి కేబినెట్లోనే నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసామని గుర్తు చేసారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ సర్వ నాశనం చేసారని ఆరోపించారు. త్వరలోనే అన్ని రంగాల్లో వాస్తవ పరిస్థితిని శ్వేత పత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. త్వరలోనే ఉపాధ్యాయుల భర్తీ ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ కోసం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జడ్జి అనుమతితో టెండర్లకు వెళ్లే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాకు అడ్డుకట్ట వేయగలమని సీఎం అభిప్రాయపడ్డారు.

కక్ష్య సాధింపులుండవు..అవినీతి చేస్తే వదలం..
తన కేబినెట్ తరహాలోనే నామినేటెడ్ పోస్టుల్లో..నామినేషన్ పనుల్లో ఇదే రకంగా సామాజిక సమీకరణాలు పాటిస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వంలో ఎవరి మీదా కక్ష్య సాధింపులు ఉండవని జగన్ ప్రకటించారు. గతంలో జరిగిన కాంట్రాక్టుల విధానం పైన నిపుణులు పరిశీలన చేస్తున్నారని..అదే సమయంలో అవినీతికి పాల్పడిన వారిని మాత్రం వదిలేది లేదని జగన్ స్పష్టం చేసారు. పధకాల అమల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. లబ్దిదారులకు పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. తాము చిత్తశుద్దిలో చేసే పాలనకు ప్రతిపక్షాలు మీడియా సహకరించాలని జగన్ అభ్యర్దించారు. వారు సహకరించకపోయినా అడుగు ముందుకే వేస్తామని జగన్ ప్రకటించారు.