వ్యవసాయానికి తగ్గిన సాయం.. బోర్లకు మీటర్లపై ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజం
జగన్ సర్కార్‌పై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి సాయం తగ్గిందని ఆరోపించారు. కేంద్రానికి దాసోహమై సాగు బోర్లకు మీటర్లు బిగిస్తున్నారని ధ్వజమెత్తారు. బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు. ? మళ్లీ రాయితీ ఇవ్వడం ఎందుకు అని నిలదీశారు. దేశంలో సగటు రుణభారం రూ.75 వేలు ఉంటే ఏపీ రైతులపై రూ.2.45 లక్షలు ఉందన్నారు.

అబద్దాలకు ఆస్కార్ అవార్డు
జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి సాయం తగ్గిందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే అది జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో రైతులపై సగటు రుణభారం రూ.75వేలు ఉంటే, ఏపీ రైతులపై ఉన్న రుణభారం రూ.2.45లక్షలు ఉండటానికి జగన్ విధానాలే కారణమని దుయ్యబట్టారు.

ఇతర పథకాలు కట్
రైతుభరోసా పేరుతో ఇతర పథకాలను ఆపేశారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రైతులను కులాల పేరుతో ప్రభుత్వం విభజిస్తోందని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేంద్ర మాట్లాడారు. రైతులను బాదే కార్యక్రమం తప్ప వాళ్లను బాగుచేసే పని ఈ ప్రభుత్వం చేయడం లేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ మీటర్లు పెట్టబోమని పక్కనే ఉన్న తెలంగాణ తేల్చిచెప్పగా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి దాసోహమైందని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

రైతులను బలి చేస్తారా..?
స్వార్థం కోసం రైతులను ఎందుకు బలి చేస్తారని వైసీపీ నేతలను ప్రశ్నించారు. రైతుల మెడపై కత్తిపెట్టి మీటర్లు పెట్టడం ఎందుకు? రాయితీ ఇవ్వడం ఎందుకు? అని నరేంద్ర నిలదీశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు కుట్రలా కనబడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆక్వా రంగంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు. ఆర్బీకేల పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. అన్నదాత మేలును మరచిందని.. సంక్షేమం అంటే మరచిపోయిందని తెలిపారు.