జగన్ అడ్డాలో ఎంపీపీ ఎన్నిక టెన్షన్-దుగ్గిరాలలో వైసీపీ వర్సెస్ టీడీపీ-2024 సెమీ ఫైనల్ !
ఏపీలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేశామని చెప్పుకున్న లోకేష్ మాటల కంటే వైసీపీ హవాయే ఇక్కడ ప్రభావం చూపింది. దీంతో ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఆర్కే విజయం సాధించారు. ఆ తర్వాత ఇక్కడ పట్టు కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీది పైచేయి అయింది. ఇవాళ జరగబోతున్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికతో ఇక ఈ వార్ హై ఓల్టేజ్ కు చేరుకుంది.

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దుగ్గిరాల మండలంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికకు సాధారణంగా చూస్తే ఎలాంటి ప్రాధాన్యత లేదు. కానీ ఇది అమరావతి పరిధిలో, మంగళగిరి నియోజకవర్గంలో మారిన పరిస్దితుల్లో వైసీపీకి పట్టున్న ప్రాంతంలో టీడీపీ పైచేయి సాధించిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంతో జరుగుతున్న ఎన్నిక కావడంతో ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు అక్కడ గెలుపు వైసీపీ, టీడీపీలకు మాత్రమే కాదు ఏకంగా జగన్ వర్సెస్ లోకేష్ వార్ గా మారిపోయింది.
జగన్ వర్సెస్ లోకేష్ వార్
వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే సీటు గెల్చుకున్న మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దుగ్గిరాల ఎంపీపీ స్ధానంలో జరుగుతున్న ఈ ఎన్నిక జగన్ వర్సెస్ లోకేష్ పోరుగా మారిపోయింది. దీనికి కారణం అక్కడ సీఎం జగన్ క్యాంపు ఆఫీసు ఉండటంతో పాటు లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం కావడమే. దీంతో ఎవరికి వారు పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో గెలిచిన పార్టీ రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో ఆధిపత్యం సాధిస్తుందన్న అంచనాలతో ఇది కాస్తా హై ఓల్టేజ్ వార్ గా మారింది.
టీడీపీకి కీలక ఆధిక్యం
గతేడాది దుగ్గిరాల మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 18 స్ధానాలకు గానూ టీడీపీకి 9, వైసీపీకి 8, జనసేనకు 1 స్ధానం దక్కాయి. అయితే ఎంపీపీ ఎన్నికకు వచ్చే సరికి ఈ బలాబలాలు ఇలాగే నిలబడితే టీడీపీ నుంచి ఎంపీపీ ఎన్నిక కావడం ఖాయం. వైస్ ఎంపీపీ పదవులు కూడా టీడీపీకే దక్కుతాయి. కానీ అలా జరిగితే కిక్కేముంది. అందుకే వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రలోభాలకు తెరలేపింది. దీంతో ఇప్పుడు టీడీపీతో పాటు వైసీపీ కూడా తమ అభ్యర్ధుల్ని కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు దిగారు. భారీ ఎత్తున డబ్బు ఆశచూపుతూ గెలిచిన ఎంపీటీసీలకు గాలం విసురుతున్నారు. ఇందులో వారు పడితే లెక్కలు తారుమారు అయ్యేందుకు ఎంతో సమయం పట్టదు.
పద్మావతి కిడ్నాపే టర్నింగ్ పాయింట్ ?
దుగ్గిరాలలో వైసీపీ నుంచి ఎంపీటీసీగా గెలిచిన తాడిబోయిన పద్మావతిని నిన్న కొందరు కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే ఆర్కేతో పాటు క్యాంప్ కు వెళ్తున్న ఆమెను కొందరు వాహనంలో తీసుకుపోయినట్లు తెలుస్తోంది. వైసీపీ ఉద్దేశపూర్వకంగానే ఈ కిడ్నాప్ కు పాల్పడిందని టీడీపీతో పాటు ఆమె కుమారుడు యోగీ కూడా ఆరోపిస్తున్నారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన స్ధానంలో ఎంపీపీ పదవిపై పద్మావతి ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ మాత్రం మరో ఎంపీటీసీ రూపురాణివైపు మొగ్గు చూపడంతో పద్మావతి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఆమెకు టీడీపీ, జనసేన మద్దతివ్వాలని కూడా నిర్ణయించాయి. దీంతో వైసీపీ ఆమెను కిడ్నాప్ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇవాళ ఎన్నిక జరిగే లోపు పద్మావతి తిరిగి వస్తే సరేసరి లేకుంటే ఏం జరగబోతుందనే దానిపై టెన్షన్ నెలకొంది.